శాఖాహారుల కోసం ప్రత్యేక డెలివరీని ప్రారంభించిన జొమాటో
ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో శాఖాహార వినియోగదారుల కోసం ప్రత్యేకంగా 'ప్యూర్ వెజ్ మోడ్'ని ప్రారంభించింది
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో శాఖాహార వినియోగదారుల కోసం ప్రత్యేకంగా 'ప్యూర్ వెజ్ మోడ్'ని ప్రారంభించింది. కేవలం శాఖాహారాన్ని మాత్రమే డెలివరీ చేయడానికి దీనిని తీసుకొచ్చారు. అలాగే దీని కోసం ప్రత్యేకంగా డెలివరీ ఏజెంట్లను కూడా ఏర్పాటు చేశారు. వినియోగదారులు ప్యూర్ వెజ్ మోడ్‌ను ఎంచుకున్నట్లయితే ఆ లిస్ట్‌లో శాఖాహార ఆహారాన్ని అందించే రెస్టారెంట్లు మాత్రమే కనిపిస్తాయి. నాన్-వెజ్ అందించే రెస్టారెంట్లు కనిపించవు. ఈ ఫుడ్‌ను డెలివరీ చేసే వారు ఇతర ఆహారాన్ని వారి బ్యాగుల్లో పెట్టుకోరని జొమాటో సహ వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్ పేర్కొన్నారు.
ఆయన ఎక్స్‌లో ఈ విధంగా రాశారు, భారత్‌లో ప్రపంచంలో అత్యధిక శాకాహారులు ఉన్నారు. వారు ఆహారాన్ని ఎలా వండుతారు, ఎలా తీసుకొస్తారనే విషయంలో ఆందోళన చెందుతున్నట్లుగా ఫీడ్‌బ్యాక్ రాగా శాకాహారుల కోసమే ఈ కొత్త సేవను తెచ్చినట్లు తెలిపారు. ఈ సదుపాయాన్ని తీసుకురావడం వెనుక ఎలాంటి మతపరమైన లేదా రాజకీయ ఉద్దేశాలు లేవని ఆయన అన్నారు. భవిష్యత్తులో కేక్‌లు పాడవకుండా డెలివరీ చేయడానికి ప్రత్యేక ఫ్లీట్‌లను కూడా ఏర్పాటు చేయనున్నామని సీఈఓ తెలిపారు.