225 చిన్న పట్టణాల్లో సేవలను నిలిపేస్తున్న జొమాటో!
ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో సంచలన నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల విడుదలైన మూడో త్రైమాసిక ఫలితాల్లో భారీ నష్టాల కారణంగా కంపెనీ దేశంలోని 225 చిన్న పట్టణాల్లో తన సేవలను నిలిపేస్తున్నట్టు వెల్లడించింది. నష్టాలను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని, గ్రాస్ ఆర్డర్ విలువ తక్కువగా 0.3 శాతం ఉన్నందున ఎంపిక చేసిన చిన్న పట్టణాల్లో సేవలను నిలిపేయాలని నిర్ణయం తీసుకున్నామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
జొమాటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో రూ. 346.6 కోట్ల నష్టాలను వెల్లడించింది. గత కొంతకాలంగా ఫుడ్ డెలివరీ పరిశ్రమలో వ్యాపారం నెమ్మదించింది. ఈ క్రమంలోనే ఎంపిక చేసిన 225 పట్టణాల్లో వ్యాపారం ఆశించిన స్థాయిలో లేదు.
అయితే, ఆయా పట్టణాల్లో సేవలను నిలిపేయాలనే నిర్ణయం వల్ల వ్యాపార వృద్ధిపై ప్రభావం ఉండకపోవచ్చని, దీర్ఘకాలానికి అనుకున్న లక్ష్యం కోసం తాత్కాలిక చర్యలు మద్దతిస్తాయని జొమాటో వివరించింది. కానీ, ఏ ఏ పట్టణాల్లో సేవలను నిలిపేయనున్నదనే విషయంపై కంపెనీ స్పష్టత ఇవ్వలేదు.