భారత వృద్ధి రేటును సవరించిన ప్రపంచ బ్యాంక్!

Update: 2023-10-03 09:49 GMT

న్యూఢిల్లీ: భారత ఆర్థికవ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థిరమైన వృద్ధి కొనసాగుతుందని ప్రపంచబ్యాంక్ అభిప్రాయపడింది. గత ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతంగా నమోదైన దేశ జీడీపీ వృద్ధి 2023-24కి 6.3 శాతానికి దిగిరావొచ్చని అంచనా వేసింది. ప్రపంచ వృద్ధి మందగించడం, దేశీయంగా ద్రవ్యోల్బణం అధికంగా ఉండటం వంటి ప్రతికూల ప్రభావం ఉన్నప్పటికీ పెట్టుబడులకు అనుకూలత, డిమాండ్ పుంజుకుంటున్న సంకేతాల కారణంగా భారత వృద్ధి మెరుగ్గానే ఉంటుందని ప్రపంచబ్యాంక్ వివరించింది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ ఒకటిగా కొనసాగుతుందని బ్యాంక్ పేర్కొంది.

అలాగే, దేశీయంగా ద్రవ్యోల్బణం అంచనాను 5.2 శాతం నుంచి 5.9 శాతానికి సవరించింది. అంతర్జాతీయ భౌగోళిక పరిణామాల ఒత్తిడి ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో భారత్ వృద్ధిని కొనసాగించగలదు. ఇదే సమయంలో వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాలకు భారత వృద్ధి వరుసగా 6.4 శాతం, 6.5 శాతం ఉండొచ్చు. అంతర్జాతీయ సవాళ్ల మధ్య జీ20 దేశాల్లో వేగవంతమైన, అభివృద్ధి చెందుతున్న దేశాల సగటు కంటే రెట్టింపు వృద్ధి భారత్ సొంతమని ప్రపంచబ్యాంక్ వెల్లడించింది.


Similar News