ఆదాయపు పన్ను తగ్గింపు, పీఎల్ఐ విస్తరణ: బడ్జెట్‌పై పెరుగుతున్న అంచనాలు

ప్రైవేట్ వినియోగం పెరిగేందుకు అవసరమని, తద్వారా ఆర్థిక ఇంజిన్‌ను పెంచేందుకు ఇది అవసరమని నిపుణులు భావిస్తున్నారు.

Update: 2024-07-11 12:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 23న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనునారు. ఈ ఏడాది ఎన్నికల కారణంగా ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రకటించిన ఆర్థిక మంత్రి పూర్తిస్థాయి బడ్జెట్‌లో అందరి డిమాండ్లను నెరవేర్చే ప్రంతం చేస్తామని చెప్పారు. దీంతో ఈసారి బడ్జెట్‌లో సామాన్యుల నుంచి పన్ను చెల్లింపుదారుల వరకు, వ్యాపార వర్గాల నుంచి స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల వరకు నిర్మలా సీతారామన్ తీసుకొచ్చే బడ్జెట్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా పన్ను మినహాయింపు, మౌలిక సదుపాయాలపై పెట్టుబడుల కొనసాగింపు సహా పలు కీలక ప్రకటనలు ఉంటాయనే అంచనాలున్నాయని పలు బ్రోకరేజీ సంస్థలు చెబుతున్నాయి. ప్రధాని మోడీ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. మెజారిటీ రాకపోవడం, ఈ ఏడాది ఆఖరులో మహారాష్ట్ర, హర్యానా వంటి కీలక రాష్ట్రాల ఎన్నికలు ఉండటంతో పన్ను మినహాయింపుపై ఎక్కువ చర్చ జరుగుతోంది.

అయితే, మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపు రాజకీయ చర్చ మాత్రమే కాకుండా ప్రైవేట్ వినియోగం పెరిగేందుకు అవసరమని, తద్వారా ఆర్థిక ఇంజిన్‌ను పెంచేందుకు ఇది అవసరమని నిపుణులు భావిస్తున్నారు. అలాగే, వంతెనలు, రైల్వే ట్రాక్‌లు, విమానాశ్రయాలు వంటి మౌలిక సదుపాయాల కల్పనపై వ్యయం ఆర్థిక వృద్ధిని పెంచుతుంది. ఇదే సమయంలో దీర్ఘకాలిక వృద్ధిని పెంచేందుకు ప్రైవేట్ పెట్టుబడులకు కూడా సరైన నిర్ణయాలు అవసరం. వినియోగం పెంచేందుకు పన్ను తగ్గింపులు, ముఖ్యంగా గ్రామీణ వర్గానికి అధిక సబ్సిడీ, పీఎల్ఐ పరిధి పెంచడం, రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం, హెల్త్‌కేర్‌ను విస్తరించడం ముఖ్యమని బోఫా సెక్యూరిటీస్ అంచనా వేసింది. మూలధన వ్యయం ద్వారా ఉద్యోగాల కల్పన, వికసిత్ భారత్‌పై దృష్టి సారించే చర్యలు ముఖ్యమని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. 


Similar News