ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి రూల్ లేదు.. భారత్‌లో వాట్సాప్ బంద్ చేస్తాం..
కొత్త ఐటీ రూల్స్-2021లోని రూల్ 4(2)ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది.
దిశ, బిజినెస్ బ్యూరో: కొత్త ఐటీ రూల్స్-2021లోని రూల్ 4(2)ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. ఈ నిబంధన ప్రకారం, ఏదైనా కంటెంట్ లేదా పోస్ట్ సోషల్ మీడియాలో వస్తే మొదటగా అది ఎవరి వద్ద నుంచి వచ్చిందనేది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అయితే దీనిని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియా సంస్థలు దేశవ్యాప్తంగా పలు కోర్టుల్లో కేసులు వేశాయి. వీటన్నింటిని సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది. దీనిపై తాజాగా విచారణ జరిపారు.
ఈ సందర్భంగా మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ సంచలన ప్రకటన చేసింది. సంస్థ న్యాయవాది మాట్లాడుతూ, మెసేజ్‌లకు ఉన్నటువంటి ఎన్‌క్రిప్షన్ విధానాన్ని తొలగించినట్లయితే వాట్సాప్ భారత్ నుంచి వైదొలుగుతుందని పేర్కొన్నారు. వాట్సాప్ తరపున న్యాయవాది తేజస్ కరియా మాట్లాడుతూ, మా ప్లాట్‌ఫామ్‌లో యూజర్ల భద్రతకు సంబంధించి ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్ విధానాన్ని అవలంబిస్తున్నాము. దీని వలనే కోట్లమంది మా ప్లాట్‌ఫామ్‌ను వినియోగిస్తున్నారు. కొత్త రూల్ కారణంగా దీనికి భంగం కలిగితే వినియోగదారులకు మాపై ఉన్న నమ్మకం దెబ్బతింటుందని అన్నారు.
పైగా ఈ రూల్ ప్రకారం, కోట్లాది మెసేజ్‌లను ఏండ్ల తరబడి స్టోర్ చేయాల్సి ఉంటుంది. ఎన్‌క్రిప్షన్‌ను తొలగించాల్సి వస్తే తాము భారత్ నుంచి వెళ్లిపోతామని కోర్టుకు తెలిపారు. 4(2) సెక్షన్ రాజ్యాంగ విరుద్ధం. సోషల్‌మీడియా సంస్థలతో ఎలాంటి చర్చలు జరపకుండానే దీనిని తీసుకొచ్చారు. ఇలాంటి నిబంధన ప్రపంచంలో ఎక్కడా లేదని వాట్సాప్ తరపున న్యాయవాది వాదించారు. కేంద్రం తరపు న్యాయవాది కీర్తిమాన్ సింగ్ వాదిస్తూ, సోషల్ మీడియాలో జరిగే విషయాలు ప్రజలకు తెలుసని, మెసేజ్ మూలాన్ని గుర్తించడమే ఈ నిబంధన వెనుక ఆలోచన అని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఆగస్టు 14వ తేదీకి వాయిదా వేసింది.