Vistara Airlines: ఉద్యోగులకు VRS తీసుకొచ్చిన విస్తారా ఎయిర్‌లైన్స్
టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ మధ్య జాయింట్ వెంచర్ అయిన విస్తారా తన ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ(VRS), వాలెంటరీ సెపరేషన్ స్కీమ్(VSS)ను తీసుకొచ్చింది.
దిశ, బిజినెస్ బ్యూరో: టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ మధ్య జాయింట్ వెంచర్ అయిన విస్తారా తన ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ(VRS), వాలెంటరీ సెపరేషన్ స్కీమ్(VSS)ను తీసుకొచ్చింది. ఇది విమాన ప్రయాణం చేయని నాన్ ఫ్లయింగ్ స్టాఫ్‌కు వర్తిస్తుంది. అర్హులైన సిబ్బంది ఆగస్టు 23 వరకు పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎయిర్‌లైన్స్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న పర్మినెంట్ స్టాఫ్‌కు వీఆర్‌ఎస్, ఎయిర్‌లైన్‌లో ఐదేళ్ల సర్వీసు పూర్తికాని సిబ్బందికి వీఎస్‌ఎస్ అమలవుతుంది. పైలట్‌లు, క్యాబిన్ సిబ్బంది, వారి విధుల నిర్వహణ కోసం లైసెన్స్‌లు కలిగి ఉన్న వారికి మాత్రం ఇవి వర్తించవు.
ఎయిర్ ఇండియాతో విలీనం వేళ ఈ స్కీమ్‌లను ప్రకటించడం గమనార్హం. అయితే ఈ పథకాలపై విస్తారా నుంచి అధికారికంగా ఎలాంటి వ్యాఖ్య లేదు. విస్తారాలో శాశ్వత, కాంట్రాక్ట్ సిబ్బందితో సహా దాదాపు 6,500 మంది ఉద్యోగులు ఉన్నారు. అదే, ఎయిర్ ఇండియా, విస్తారాలో కలిపి 23,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ రెండు సంస్థల విలీనంతో సుమారు 600 మంది నాన్ ఫ్లయింగ్‌స్టాఫ్‌పై ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలో వీరికి ఎయిర్ ఇండియా గ్రూప్‌లోని ఇతర విభాగాలు, టాటా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నాలు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉంటే ఈ విలీనం తరువాత ఎయిర్‌ఇండియా అతిపెద్ద విమానయాన సంస్థగా అవతరిస్తుంది. ఈ ఒప్పందాన్ని నవంబర్ 2022లో ప్రకటించారు. ఇది పూర్తయిన తర్వాత, సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఇండియాలో 25.1 శాతం వాటాను కలిగి ఉంటుంది.