బ్యాంకుల వద్ద క్లెయిమ్ చేయని సొమ్ము రూ. 78,213 కోట్లు: ఆర్‌బీఐ
2024, మార్చి నాటికి రూ. 78,213 కోట్లకు చేరుకున్నాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) వెల్లడించింది.
దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో క్లెయిమ్ చేయకుండా ఉండిపోయిన డిపాజిట్లు ఏడాది కాలంలో 26 శాతం పెరిగి 2024, మార్చి నాటికి రూ. 78,213 కోట్లకు చేరుకున్నాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) వెల్లడించింది. ఆర్‌బీఐ తాజా వార్షిక నివేదిక ప్రకారం.. 2023, మార్చి నాటికి బ్యాంకుల వద్ద క్లెయిమ్ చేయని సొమ్ము రూ. 62,225 కోట్లు ఉన్నాయి. సహకార బ్యాంకులతో సహా అన్ని బ్యాంకుల వద్ద 10 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల పాటు ఖాతాల్లో ఉండిపోయిన డిపాజిట్లను ఆర్‌బీఐ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవెర్‌నెట్(డీఈఏ) ఫండ్‌కు బదిలీ చేస్తుంది. బ్యాంకింగ్ రంగంలో క్లెయిమ్ చేయని సొమ్మును తగ్గించేందుకు, అటువంటి సొమ్మును సొంతవారికి, క్లెయిమ్‌దారులకు తిరిగిచ్చేందుకు బ్యాంకులు, ఆర్‌బీఐ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే అందుకనుగుణంగా చర్యలు కూడా ప్రారంభించాయి. ఇటీవల ఆర్‌బీఐ కొన్ని నిబంధనలను కూడా తీసుకొచ్చింది. ఇవి అన్ని కమర్షియల్ బ్యాంకులకు(ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కూడా), అన్ని సహకార బ్యాంకులకు 2024, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. అలాగే, దేశంలో రూ. 500 నోట్లకు అధిక డిమాండ్ ఉందని ఆర్‌బీఐ తన నివేదిక అభిప్రాయపడింది. ఆర్‌బీఐ గతేడాది మేలో రూ. 2000 నోట్లను ఉపసంహరించుకున్న తర్వాత వీటి వినియొగం అధికంగా ఉందని, 2024, మార్చి నాటికి దేశవ్యాప్తంగా 86.5 శాతం రూ. 500 నోట్లే ఉన్నాయని తెలిపింది. అంతకుముందు ఏడాది వీటి వినియోగం 77.1 శాతంగా ఉండేదని ఆర్‌బీఐ తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ. 500 నోట్ల సంఖ్య 5.16 లక్షలుగా ఉన్నాయి. దీని తర్వాత అత్యధికంగా 2.49 లక్షల రూ. 10 నోట్లు చలామణిలో ఉన్నాయి.