రిచ్ లిస్ట్‌లో పెరిగిన బ్రిటన్ ప్రధానమంత్రి దంపదతుల సంపద

గతేడాది 651 మిలియన్ పౌండ్లతో 275వ స్థానంలో ఉన్న ఈ దంపతులు ఈ ఏడాది 245వ ర్యాంకుకు ఎగబాకారు.

Update: 2024-05-17 13:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: బ్రిటీష్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి బ్రిటన్ చరిత్రలోనే అత్యంత సంపన్న ప్రధానమంత్రి దంపతులుగా నిలిచారు. సరిగ్గా రెండేళ్ల క్రితం 'సండే టైమ్‌ రిచ్‌ లిస్ట్‌'లో స్థానం దక్కించుకున్న ఈ దంపతుల సంపద 2024 ర్యాంకింగ్స్‌లో మరింత పెరిగింది. ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ షేర్ల కారణంగానే వీరి ఆదాయం భారీగా పెరిగింది. గతేడాది 651 మిలియన్ పౌండ్లతో 275వ స్థానంలో ఉన్న ఈ దంపతులు ఈ ఏడాది 245వ ర్యాంకుకు ఎగబాకారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన ఓ ఆర్థిక నివేదిక ప్రకారం, అక్షతామూర్తి సంపాదన ఆమె భర్త కంటే ఎక్కువగా ఉండటం విశేషం. 2022-23లో రిషి సునాక్ రూ. 2.2 మిలియన్ పౌండ్ల సంపాదనను కలిగి ఉంటే, గతేడాది అక్షతా మూర్తి సంపద 13 మిలియన్ పౌండ్లుగా ఉంది. వీరిద్దరి అత్యధిక సంపదకు ఇన్ఫోసిస్‌లో అక్షతామూర్తికి ఉన్న వాటాయే కారణం. ఆమె తండ్రి నారాయణమూర్తి స్థాపించిన కంపెనీలో ఉన్న షేర్ల కారణంగా ఆమెకు భారీగా సంపద సమకూరుతోంది. గతేడాది ఇన్ఫోసిస్ షేర్ల విలువ 108.8 మిలియన్ పౌండ్ల నుంచి సుమారు 590 మిలియన్ పౌండ్లకు పెరిగాయి. అదే సమయంలోనే అక్షతామూరి 13 మిలియన్ పౌండ్ల డివిడెండ్‌ను పొందినట్టు సండే టైమ్ రిచ్ లిస్ట్ నివేదిక పేర్కొంది. ఈ ఏడాది మరో 10.5 మిలియన్ పౌండ్లను ఆమె అందుకోనున్నట్టు నివేదిక తెలిపింది. వీరి తర్వాత బ్రిటన్‌లో అత్యంత సంపన్న కుటుంబాల్లో హిందూజ కుటుంబం కూడా ఉంది. వీరి కుటుంబం 37.19 బిలియన్ పౌండ్లతో మరోసారి అగ్రస్థానంలో ఉంది. సండే టైమ్ రిచ్ లిస్ట్ టాప్-10లో భారత్‌లో జన్మించిన డేవిడ్, సైమన్ రూబెన్ సోదరులు 24.97 బిలియన్ పౌండ్లతో నాలుగో ర్యాంకు నుంచి మూడో ర్యాంకుకు ఎగబాకారు. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ అధిపతి లక్ష్మీ ఎన్ మిట్టల్ ఈ జాబితాలో ఎనిమిదో ర్యాంకులో ఉన్నారు. వేదాంత రిసోర్సెస్ అధిపతి అనిల్ అగర్వాల్ 7 బిలియన్ పౌండ్లతో 23వ స్థానంలో ఉన్నారు. 

Tags:    

Similar News