ఆర్థిక మాంద్యంలోకి ప్రవేశించిన యూకే ఆర్థికవ్యవస్థ
డిసెంబర్ త్రైమాసికంలో 0.3 శాతం క్షీణించింది. అంతకుముందు త్రైమాసికంలోనూ యూకే 0.1 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేసింది.
దిశ, బిజినెస్ బ్యూరో: బ్రిటన్ ఆర్థికవ్యవస్థ గతేడాది ద్వితీయార్థంలో మాంద్యంలోకి ప్రవేశించింది. 2023, డిసెంబర్ త్రైమాసికంలో ఊహించిన దానికంటే అధ్వాన్నంగా 0.3 శాతం క్షీణించింది. అంతకుముందు జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలోనూ యూకే 0.1 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేసింది. ఈ మేరకు ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్(ఓఎన్ఎస్) అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ఆర్థికవేత్తల రాయిటర్స్ పోల్ అక్టోబర్-డిసెంబర్ కాలానికి యూకే జీడీపీ 0.1 శాతం తగ్గుతుందని అంచనా వేసినప్పటికీ, దానికంటే ఎక్కువగా ఆర్థికవ్యవస్థ బలహీనపడింది. అయితే, 2024లో బ్రిటన్ ఆర్థికవ్యవస్థ పుంజుకుంటుందని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఆర్థిక మాంద్యం పరిస్థితుల కారణంగా ఈ ఏడాది జరగబోయే జాతీయ ఎన్నికలకు ముందు ఆ దేశ ప్రధానమంత్రి రిషి సునక్‌కు ఓటరు మద్దతును పొందడంలో సవాళ్లు తప్పేలా లేవు. వరుసగా రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థ మందగమనానికి గురైతే దానిని మాంద్యంగా పరిగణిస్తారు. జీడీపీ డేటా విడుదల తర్వాత, బ్రిటీష్ పౌండ్, యూరో కరెన్సీలు బలహీనపడ్డాయి.