ఆ రిజిస్ట్రేషన్ చేయని టొబాకో వ్యాపారులకు భారీ జరిమానా

పొగాకు పరిశ్రమలో ఆదాయ నష్టాన్ని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.

Update: 2024-02-04 12:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: పొగాకు ఉత్పత్తుల తయారీదారులకు జీఎస్టీ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. పాన్ మసాలా, గుట్కా, ఇతర పొగాకు ఉత్పత్తుల తయారీదారులు తమ ప్యాకింగ్ యంత్రాలను ఏప్రిల్ 1 నుంచి వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అధికారుల వద్ద రిజిస్ట్రేషన్ చేయకపోతే రూ. లక్ష వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. పొగాకు పరిశ్రమలో ఆదాయ నష్టాన్ని నివారించేందుకు సెంట్రల్ జీఎస్టీ చట్టంలో చేసిన సవరణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. గతేడాది పొగాకు తయారీదారులు ఉపయోగించే యంత్రాలను నమోదు చేసుకునేందుకు జీఎస్టీ కౌన్సిల్ ప్రత్యేక విధానాన్ని సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. ఇది ఏప్రిల్ 1 నుంచి అమలు కానుండగా, రిజిస్ట్రేషన్ చేయని ప్రతి యంత్రానికి రూ. లక్ష జరిమానా విధించబడుతుంది. నిబంధనలకు విరుద్ధంగా ఇన్‌స్టాల్ చేసిన యంత్రాలు ఉంటే గనక స్వాధీనం చేసుకోవడం లేదా జప్తు చేయడం జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న, కొత్తగా ఇన్‌స్టాల్ చేసిన మెషీన్‌ల వివరాలను, వాటి ప్యాకింగ్ సామర్థ్యంతో సహా, ఫారమ్ జీఎస్టీ ఎస్ఆర్ఎం-1లో అందించాలని, అలా చేయని పక్షంలో జరిమానా ఉంటుందని స్పష్టం చేశారు.

Tags:    

Similar News