ITC: సెంచురీ పల్ప్ అండ్ పేపర్ వ్యాపారాన్ని ఐటీసీకి విక్రయించిన ఆదిత్య బిర్లా కంపెనీ

పూర్తిస్థాయిలో రియల్ ఎస్టేట్ విభాగంపై దృష్టి సారించేందుకు గానూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఏబీఆర్ఈఎల్ పేర్కొంది.

Update: 2025-03-31 16:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన రియల్టీ విభాగం ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్ లిమిటెడ్ (ఏబీఆర్ఈఎల్) సోమవారం తన పల్ప్ అండ్ పేపర్ వ్యాపారాలను ప్రముఖ ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీకి విక్రయించడానికి బోర్డు అనుమతి పొందినట్లు తెలిపింది. ఈ విక్రయం విలువ రూ. 3,498 కోట్లని కంపెనీ వెల్లడించింది. పూర్తిస్థాయిలో రియల్ ఎస్టేట్ విభాగంపై దృష్టి సారించేందుకు గానూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఏబీఆర్ఈఎల్ పేర్కొంది. ఇరు కంపెనీల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం, ఉత్తరాఖండ్‌లోని లాల్‌కువాన్‌లో ఉన్న సెంచురీ పల్ప్ అండ్ పేపర్(సీపీపీ) వాటాదారుల అనుమతితో, అన్ని ప్రక్రియలను అనుసరించి ఐటీసీకి విక్రయించడం జరుగుతుంది. ప్రస్తుతం ఏబీఆర్ఈఎల్ మెరుగైన వృద్ధిని సాధిస్తోంది. దీనివల్ల రియల్ ఎస్టేట్ విభాగంపైనే సమయాన్ని కేటాయించడం, వ్యాపార వృద్ధికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవడం వీలవుతుందని ఏబీఆర్ఈఎల్ ఎండీ ఆర్ కె దాల్మియా చెప్పారు. తమ సెంచురీ పల్ప్ అండ్ పేపర్ విభాగం కొన్నేళ్లుగా మెరుగైన పనితీరును కలిగి ఉంది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఐటీసీ విశ్వసనీయమైన సంస్థగా నమ్మాం. తమ వ్యాపారాన్ని ఐటీసీ విక్రయించడం సంతోషంగా ఉందని దాల్మియా తెలిపారు. ప్రస్తుతం ఉన్న సీపీ ఫెలిసిటీలో విస్తరణకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ కొనుగోలు ద్వారా కొత్త ప్రదేశంలో సామర్థ్య విస్తరణకు అనువుగా ఉంటుందని, తమ పేపర్‌బోర్డులు, స్పెషాలిటీ పేపర్ వ్యాపారంలో మరింత వృద్ధికి వీలవుతుందని ఐటీ అధికారిక ప్రకటనలో పేర్కొంది. 

Tags:    

Similar News