UPI services down: వరుసగా యూపీఐ ట్రబుల్.. డిజిటల్ ఇండియాకు ఇదో హెచ్చరికనా?

వరుసగా యూపీఐ సేవల్లో అంతరాయం దేశ ఆర్థిక రంగంలో కొత్త చర్చకు దారి తీస్తోంది.

Update: 2025-04-13 10:29 GMT
UPI services down: వరుసగా యూపీఐ ట్రబుల్.. డిజిటల్ ఇండియాకు ఇదో హెచ్చరికనా?
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల్లో కొత్త విప్లవం తీసుకువచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్(యూపీఐ) (UPI Services Down) వినియోగదారులకు ట్రబుల్‌గా మారింది. గడిచిన మూడు వారాల్లో మూడు సార్లు యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడి వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. నిన్న మరోసారి ఫోన్ పే(Phone Pay), గూగుల్ పే (Google Pay), పేటీఎం (PayTM) వంటి సేవలు పని చేయలేదు. గల్లీలోని టీ కొట్టు నుంచి ముంబయిలోని స్టాక్ మార్కెట్లలో పేమెంట్ల వరకు యూపీఐ వినియోగం పాతుకుపోయిన నేపథ్యంలో యూపీఐ సేవలు నిలిచిపోతుండటం వినియోగదారులను కలవరపాటుకు గురి చేస్తోంది. ముఖ్యంగా ఎమర్జెన్సీ టైమ్‌లో ఈ తరహా పేమెంట్లను నమ్ముకున్న కస్టమర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఓ వైపు డిజిటల్ పేమెంట్స్‌లో మన దేశం దూసుకుపోతున్నదని గొప్పగా చెప్పుకుంటుంటే మరో వైపు యూపీఐ సేవలు వరుసగా విఫలం కావడం వినియోగదారులు, విక్రయదారులకు సమస్యగా మారింది.

డిజిటల్ ఇండియాకు ఇది హెచ్చరికనా?

2016లో అందుబాటులోకి వచ్చిన యూపీఐ సేవలు అతి తక్కువ కాలంలోనే భారత ఆర్థిక వ్యవస్థను కమ్మేసింది. సులభమైన లావాదేవీలు, క్షణాల్లో నగదు బదిలీకి ఆస్కారం ఉండటంతో యూపీఐ సేవల వినియోగం మారుమూల ప్రాంతాల్లోనూ అనివార్యంగా మారిపోయింది. 2019లో మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో 34 శాతంగా ఉన్న యూపీఐ చెల్లింపులు 2024 నాటికి 83 శాతానికి పెరిగాయని ఆర్‌బీఐ నివేదిక వెల్లడించింది. డిజిటల్ సేవలు భారతదేశానికి వెన్నెముకగా మారుతున్నాయనే విషయాన్ని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. యూపీఐ వచ్చాక వినియోగదారులతో పాటు మర్చంట్లు యూపీఐ వినియోగించక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో రోజువారీ కొనుగోళ్లలో లిక్విడ్ క్యాష్ వినియోగం దాదాపు తగ్గిపోయింది. రూపాయి విలువ చేసే వస్తువు కొనుగోలుకైనా యూపీఐనే నమ్ముకుంటున్నారు. చాలా మంది అత్యవసర సమయాల్లోనూ యూపీఐపైనే ఆధారపడుతున్నారు. అయితే వరుసగా యూపీఐ విఫలం కావడం భారతదేశం పూర్తిగా డిజిటలైజ్ కావడానికి ముందు మరింత మెరుగైన ప్రణాళిక వేసుకోవాలని, చెల్లింపుల విధానంలో ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలనే హెచ్చరిక లాంటిదనే చర్చ ప్రస్తుతం జోరుగా జరుగుతోంది.

క్యాష్ ఈజ్ కింగ్

దేశవ్యాప్తంగా యూపీఐ పేమెంట్లు ఫెయిల్ కావడం పట్ల జేబుల్లో డబ్బు ఉండటం ఎంత ముఖ్యమో మరోసారి తెలిసి వస్తోందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. క్యాష్ ఈజ్ కింగ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఎమర్జెన్సీ సమయాల్లో యూపీఐ సేవలను నమ్ముకుంటే నట్టేట మునిగినట్లేనని సూచిస్తున్నారు. ఇప్పటి వరకు ఎదుర్కొన్న యూపీఐ సేవల అంతరాయాలన్నీ తాత్కాలికమే అయినా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి దాని తీవ్రత ఏంటో తెలిసివస్తోందని, అందువల్ల ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు లిక్విడ్ క్యాష్ దగ్గర ఉంచుకోవాలని సలహాలు ఇస్తున్నారు. ఈ తరహా ఇబ్బందులు యూపీఐ వ్యవస్థ విశ్వసనీయత, డిజిటల్ ఇండియా (Digital India) లక్ష్యాలపై దీర్ఘకాలిక ప్రభావం పడే అవకాశం ఉన్నదని అభిప్రాయపడుతున్నారు. ఈ సమస్యలు తరచూ తలెత్తకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాల దృష్ట్యా ప్రత్యామ్నాయ చెల్లింపుల విధానాలను ప్రోత్సహించాలనే చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News