FPIs: ఇప్పటివరకు రూ.31,575 నిధులు ఉపసంహరించిన ఎఫ్‌పీఐలు
ఆర్థిక మార్కెట్లలో అస్థిరత, పెరుగుతున్న టారిఫ్ కారణంగా పెట్టుబడిదారుల సెంటిమెంట్ బలహీనంగా ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌తో సహా చాలా దేశాలపై అమెరికా విధించిన భారీ సుంకాల కారణంగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈ నెలలో ఇప్పటివరకు భారీ మొత్తంలో నిధులను ఉపసంహరించుకున్నారు. దేశ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు రూ.31,575 కోట్లను ఉపసంహరించుకున్నారని డిపాజిటరీ గణాంకాలు వెల్లడించాయి. అంతర్జాతీయంగా ఆర్థిక మార్కెట్లలో నెలకొన్న అస్థిరత, పెరుగుతున్న టారిఫ్ ఆందోళనల కారణంగా పెట్టుబడిదారుల సెంటిమెంట్ బలహీనంగా ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. డేటా ప్రకారం, ఏప్రిల్ 1-11 తేదీల మధ్య ఎఫ్‌పీఐలు భారతీయ ఈక్విటీల నుంచి రూ.31,575 కోట్లను ఉపసంహరించుకున్నాయి. దీంతో 2025లో ఇప్పటివరకు ఎఫ్‌పీఐల మొత్తం ఔట్‌ఫ్లో రూ.1.48 లక్షల కోట్లకు చేరుకుంది. ప్రస్తుతానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్‌ల ప్రభావం కారణంగా మాత్రమే భారత ఈక్విటీల్లో అమ్మకాలు జరుగుతున్నాయి. కీలక భౌగోళిక రాజకీయాల్లో రిస్క్ ఆధారంగా మార్కెట్లు ప్రతిస్పందిస్తున్నాయి. అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం నేపథ్యంలో కొంతకాలానికి ఎఫ్‌పీఐలు తిరిగి భారత్‌ను పెట్టుబడులకు ఎంచుకుంటాయని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వికె విజయకుమార్ తెలిపారు. భారత్‌కు స్వతహాగా ఉన్న స్థానిక డిమాండ్, వాణిజ్య పరమైన నిర్ణయాలు దీర్ఘకాలంలో ఎఫ్‌పీఐలకు భారత్ సరైన ఎంపికగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.