RBI: ఈసారి రెపో రేటులో 50 బేసిస్ పాయింట్ల తగ్గింపు ఉండొచ్చు

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రెపో రేటును మరో 50 బేసిస్ పాయింట్లు తగ్గించడం మంచిదని కొందరు నిపుణులు సూచిస్తున్నారు.

Update: 2025-03-31 14:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: మరో వారం రోజుల్లో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) సమావేశం నిర్వహించనుంది. ఇటీవల ఫిబ్రవరిలో జరిగిన సమావేశంలో నెమ్మదించిన ఆర్థికవ్యవస్థ వృద్ధికి మద్దతుగా ఐదేళ్లలో తొలిసారి కీలక రేట్లను తగ్గించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 7-9 తేదీల మధ్య జరగబోయే సమావేశంలో మరోసారి వడ్డీ రేట్ల తగ్గింపు ఉంటుందనే అంచనాలను ఆర్థికవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతోంది. మరోవైపు బ్యాంకుల ద్రవ్యలోటు మెరుగ్గా ఉంది. కానీ 2024-25 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో అధిక రుణ వ్యయాలు, తగ్గుముఖం పట్టిన క్రెడిట్ వృద్ధి కారణంగా ఆర్థిక వృద్ధి నెమ్మదించింది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వచ్చే సమావేశంలో రెపో రేటును మరో 50 బేసిస్ పాయింట్లు తగ్గించడం మంచిదని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. ద్రవ్యోల్బణం, బ్యాంక్ ద్రవ్యలోటు, భారత రూపాయి బలంగా ఉన్న ఈ పరిస్థితుల మధ్య కీలక రేటు తగ్గింపును కొనసాగించడం అవసరమని పిరమల్ గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్ దేబోపం చౌదరి తెలిపారు. మరికొందరు ఆర్థిక నిపుణులు మాత్రం, వచ్చే సమావేశంలోనూ ఆర్‌బీఐ 25 బేసిస్ పాయింట్ల తగ్గింపునకే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రపంచ వడ్డీ రేట్ల ట్రెండ్‌లకు సంబంధించి, 2024, సెప్టెంబర్ నుంచి అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇప్పటికే 100 బేసిస్ పాయింట్లను తగ్గించిందని, అదే సమయంలో భారతీయ రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు మాత్రమే తగ్గిందని చౌదరి వివరించారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న స్థాయి నుంచి భారతీయ రెపో రేటు 2025 చివరి నాటికి 5.5 శాతానికి తీసుకురావొచ్చని పలు నివేదికలు భావిస్తున్నాయి. 

Tags:    

Similar News