అలర్ట్.. సెప్టెంబర్‌లో మారనున్న ఐదు కీలక ఆర్థిక అంశాలు
దిశ, వెబ్‌డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబర్ నెలలో ఆర్థిక పరమైన అంశాలలో కీలక మార్పులు రానున్నాయి. Latest Telugu News
దిశ, వెబ్‌డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబర్ నెలలో ఆర్థిక పరమైన అంశాలలో కీలక మార్పులు రానున్నాయి. ప్రజల రోజువారీ దినచర్య లో భాగంగా అనేక ఆర్థిక అంశాలు ప్రభావితం కానున్నాయి. సెప్టెంబర్‌లో ముఖ్యంగా ఐదు రంగాలలో కీలక మార్పులు ఉంటాయి. అవి పన్ను రిటర్న్‌లు, డెబిట్ కార్డ్‌లపై ఫీజులు, టోకనైజేషన్, నేషనల్ పెన్షన్ సిస్టమ్, అటల్ పెన్షన్ యోజన మొదలగు అంశాలలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. అంశాల వారీగా పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం.
పన్ను రిటర్న్‌ల చెల్లింపు తేదీ:
ఆగస్టు 1, 2022న లేదా ఆ తర్వాత ( జులై 31 గడువు తేదీ తర్వాత) దాఖలు చేసిన పన్ను రిటర్న్‌ల వెరిఫికేషన్ కాలపరిమితి 120 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించారు. దీని వలన ఆగస్టు 8న ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేసినట్లయితే, సెప్టెంబర్ 7లోపు రిటర్న్‌లను(ITR e-verification) ధృవీకరించాలి. లేదంటే పన్ను రిటర్న్‌ను ప్రక్కన పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆదాయపు పన్ను రిటర్న్‌లను సబ్మిట్ చేసిన రోజు నుండి 30 రోజులలోపు ఈ- వెరిఫికేషన్ చేయాలి.
జులై 31, 2022న లేదా అంతకు ముందు దాఖలు చేసిన పన్ను రిటర్న్‌ల కోసం, రిటర్న్‌లను ధృవీకరించే కాల పరిమితి మాత్రం 120 రోజులుగా ఉంది. నిర్ణీత సమయం లోపల ITR e-verification పూర్తి చేయడం వలన జరిమానాలు, ఫీజుల భారం నుంచి తప్పించుకోవచ్చు.
టోకనైజేషన్:
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆదేశం ప్రకారం, టోకనైజేషన్ సిస్టం అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుంది. ఆన్‌లైన్, పాయింట్ ఆఫ్ సేల్ (POS), యాప్‌లో లావాదేవీల క్రెడిట్, డెబిట్ కార్డ్ డేటాను సురక్షితంగా ఉంచడానికి టోకనైజేషన్ చాలా ముఖ్యమని RBI తెలిపింది. దీంతో కార్డ్ నంబర్‌లు, CVV లేదా గడువు తేదీని సర్వర్‌లలో సేవ్ చేయడం కుదరదు. చెల్లింపు గేట్‌వే పేజీలో కార్డ్ వినియోగదారులు టోకెన్‌ను సేవ్ చేయాలి. సేవ్ చేసిన టోకెన్‌తో కార్డ్ వివరాలు మాస్క్ చేయబడుతాయి. కాబట్టి కార్డ్‌ని దుర్వినియోగం చేయడం కుదరదు. లావాదేవీలను సులభంగా చేయడానికి టోకనైజేషన్ ఉపయోగంగా ఉంటుందని RBI పేర్కొంది.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఫీజు పెంపు:
సెప్టెంబర్ 1 నుంచి ఎన్‌పిఎస్(జాతీయ పింఛను పథకం) కింద పింఛన్ చెల్లింపుదారులు, స్వచ్ఛంద పింఛను జమకు నేరుగా( డైరెక్ట్-రెమిట్ మోడ్ ద్వారా) డబ్బు చెల్లించేటప్పుడు దాని మీద ఉన్న కమీషన్‌ను 0.10 శాతం నుంచి 0.20 శాతానికి పెంచారు. ఎన్‌పిఎస్ చెల్లింపు దారులు నేరుగా పింఛను జమ ఎంపికను ఎంచుకొవడం వల్ల POPలకు ఫీజు చెల్లించే అవకాశం లేకుండా ఉంటుంది.
NPS, చందాదారులకు మధ్య ఉన్న POPలకు లాభం చేకూర్చడానికి అధికారులు కమీషన్‌ను 0.10 శాతం నుంచి 0.20 శాతానికి పెంచినట్లు తెలిపారు. ఉదాహరణకు, సెప్టెంబరు 1న ఎన్‌పిఎస్‌లో డైరెక్ట్-రెమిట్ మోడ్‌లో రూ. 50,000 పెట్టుబడి పెడితే, రూ. 50 కి బదులుగా రూ. 100 కమీషన్ తీసుకుంటారు. ఈ కమీషన్‌లు బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు లేదా ఎన్‌పిఎస్‌లో పెట్టుబడి పెట్టడంలో సహాయపడే ఇతర ఆర్థిక సంస్థల వంటి వాటికి అందించబడతాయి.
డెబిట్ కార్డ్ ఛార్జీల పెంపు:
సెప్టెంబర్ నుండి, అనేక బ్యాంకులు డెబిట్ కార్డులపై వార్షిక ఛార్జీలు, కార్డు జారీ ఫీజులను పెంచుతున్నట్లు ప్రకటించాయి. కార్డ్, ఇతర ఇన్‌పుట్‌లలో ఉపయోగించే సెమీకండక్టర్ చిప్‌ల ధర బాగా పెరగడం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఉదాహరణకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) సెప్టెంబర్ 6 నుండి అమలులోకి వచ్చే అనేక రకాల డెబిట్ కార్డ్‌ల ఛార్జీలను పెంచింది. IOB నుండి రూపే క్లాసిక్ డెబిట్ కార్డు జారీకి ఫీజు రూ. 50, రెండవ సంవత్సరం నుంచి వార్షిక ఛార్జ్ రూ. 150. రెండవ సంవత్సరం నుండి కార్డు జారీ ఫీజు, వార్షిక ఛార్జీలు వరుసగా రూ.150, రూ.250 కి పెరుగుతాయి.
అటల్ పెన్షన్ యోజన:
ఆదాయపు పన్ను చెల్లింపుదారులు అక్టోబర్ 1 నుంచి అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌కు అనర్హులని ప్రభుత్వం ప్రకటించింది. అంతకంటే ముందు ఈ స్కీమ్‌లో ఉన్న వారు మాత్రం దీనిలో కొనసాగుతారు. అటల్ పెన్షన్ యోజన లో పెట్టుబడి పెట్టడానికి 18-40 సంవత్సరాల వయస్సు గల అసంఘటిత రంగంలో వారు దీనిలో చేరవచ్చు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా నిర్వహించబడే పెన్షన్ పథకం అసంఘటిత కార్మికులకు నెలకు రూ. 1,000-5,000 కనీస హామీ పెన్షన్‌ను అందిస్తుంది. దీనిని 2015లో ప్రారంభించారు.