జులై 22న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి..!

కేంద్ర బడ్జెట్ 2024 ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జులై 22న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది

Update: 2024-06-14 07:53 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర బడ్జెట్ 2024 ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జులై 22న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. కచ్చితమైన తేదీలను ప్రభుత్వం ఇంకా ప్రకటించనప్పటికి ఇదే రోజున బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టవచ్చని సమాచారం. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత సీతారామన్ గత ప్రభుత్వంలో ఆమె నిర్వహించిన అదే ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలను తిరిగి చేపట్టారు. జూన్ 12న సీనియర్ అధికారులతో సమావేశమై 2024-2025 కేంద్ర బడ్జెట్‌కు సన్నద్ధతను ప్రారంభించాలని నిర్మలా సీతారామన్ ఆదేశించినట్లు ఇటీవల సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

18వ లోక్‌సభ సమావేశాలు జూన్‌ 24 నుంచి జులై 3వ తేదీ వరకు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ఇప్పటికే ప్రకటించారు. అయితే కేవలం పది రోజులు జరిగే ఈ సమావేశాల్లో కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక మొదలైనవి జరగనున్నాయి. దీంతో బడ్జెట్ ప్రవేశపెట్టి, దాన్ని చర్చించడం సాధ్యం కాదని భావించిన కేంద్రం దానిని పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టాలని చూస్తుంది.

వర్షాకాల సమావేశాలు జులై 22 నుంచి ఆగస్టు 9 మధ్య జరిగే అవకాశం ఉంది. మొదటి రోజున పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, తదుపరి చర్చించడానికి సమయం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు మళ్లి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టినట్లయితే వరుసగా ఏడుసార్లు బడ్జెట్‌ సమర్పించిన రికార్డును సృష్టిస్తుంది. ఇదిలా ఉంటే సీతారామన్ నేతృత్వంలోని వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ సమావేశం జూన్ 22న న్యూఢిల్లీలో జరగనుంది. అక్టోబర్ 2023 తర్వాత ఈ సమావేశం జరగడం ఇదే తొలిసారి.


Similar News