తమిళనాడు ప్లాంట్‌లో టాటా మోటార్స్ JLR లగ్జరీ కార్లు!
దిగ్గజ ఆటోమొబైల్ తయారీ సంస్థ టాటా మోటార్స్ దక్షిణాదిలోని తమిళనాడులో రూ.8,354 కోట్ల($1 బిలియన్ల)తో ప్లాంట్‌ను నిర్మించాలని చూస్తుంది.
దిశ, బిజినెస్ బ్యూరో: దిగ్గజ ఆటోమొబైల్ తయారీ సంస్థ టాటా మోటార్స్ దక్షిణాదిలోని తమిళనాడులో రూ.8,354 కోట్ల($1 బిలియన్ల)తో ప్లాంట్‌ను నిర్మించాలని చూస్తుంది. అయితే దీనిలో లగ్జరీ కార్లు అయినటువంటి జాగ్వార్ ల్యాండ్ రోవర్ మోడళ్లను తయారు చేయనుందని సంబంధిత వర్గాల నుంచి సమాచారం వచ్చింది. ఇంతకుముందు టాటా మోటార్స్ మార్చిలో తమిళనాడులో కొత్త ప్లాంట్‌లో పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించింది, అయితే అక్కడ ఏ మోడల్స్ తయారు చేస్తారో పేర్కొనలేదు. తాజాగా దీనిపై ఇప్పుడు క్లారిటీ వచ్చింది.
2008లో ప్రతిష్టాత్మకమైన JLR బ్రాండ్‌ను కంపెనీ కొనుగోలు చేసిన తరువాత దాని కార్యకలాపాలను మరింత విస్తరించింది. ప్రస్తుతం ఈ లగ్జరీ మోడల్‌కు మంచి ఆదరణ ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రిటైల్ అమ్మకాలలో 81 శాతం పెరుగుదలను నమోదు చేసి, మొత్తం 4,436 యూనిట్లను విక్రయించింది. దేశీయ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టినప్పటి నుండి గత ఐదేళ్లలో ఈ బ్రాండ్ అత్యధిక విక్రయాలను నమోదు చేసింది. రేంజ్ రోవర్ మోడల్ ఏడాది ప్రాతిపదికన 160 శాతం వృద్ధిని సాధిస్తుంది.
టాటా మోటార్స్ తన అన్ని వాహనాల అమ్మకాల్లో మార్చి 31, 2024తో ముగిసే నాల్గవ త్రైమాసికంలో ఎనిమిది శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఎలక్ట్రిక్ వాహనాలతో సహా టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల విభాగం పటిష్టమైన పనితీరును కనబరిచింది.