Tata Motors: 'కర్వ్' పెట్రోల్, డీజిల్ మోడళ్లను విడుదల చేసిన టాటా మోటార్స్

ఈ ప్రారంభ ధరలు లాంచ్ సందర్భంగా ఇస్తున్న ఆఫర్‌లో భాగమని, ఈ ఏడాది నవంబర్ తర్వాత ధరలు పెరుగుతాయని కంపెనీ స్పష్టం చేసింది.

Update: 2024-09-02 14:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ఇటీవల విడుదల చేసిన కర్వ్ మోడల్ కారులో పెట్రోల్, డీజిల్ వెర్షన్‌లను సోమవారం విడుదల చేసింది. నెల రోజుల క్రితం టాటా తన కర్వ్ ఈవీ మోడల్‌ను తీసుకొచ్చింది. ఇప్పుడు పెట్రోల్ వెర్షన్‌ను రూ. 9.99 లక్షల ప్రారంభ ధరతో, డీజిల్ వెర్షన్ రూ. 11.49 లక్షల ధరతో అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రారంభ ధరలు లాంచ్ సందర్భంగా ఇస్తున్న ఆఫర్‌లో భాగమని, ఈ ఏడాది నవంబర్ తర్వాత ధరలు పెరుగుతాయని కంపెనీ స్పష్టం చేసింది. ఎలక్ట్రిక్ వేరియంట్ తరహాలోనే ఇంధన వేరియంట్ కూడా ఒకే రకమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇంధన వేరియంట్లు స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్, అకాప్లిష్డ్ వంటి నాలుగు ట్రిమ్‌లలో లభిస్తుంది. ఇంటీరియర్ డ్యూయల్-టోన్ బుర్గుండి, బ్లాక్ కలర్‌ సహా ఆరు రంగుల్లో అందుబాటులో ఉంది. మూడు ఇంజన్ ఆప్షన్‌లలో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.2 లీటర్ టీ-జీడీఐ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఉన్నాయి. ముఖ్యంగా డీజిల్ వేరియంట్‌లో డ్యూయెల్ క్లచ్ ఆటో ట్రాన్స్‌మిషన్‌తో వచ్చిన మొదటి కారు టాటా కర్వ్ కావడం విశేషం. వీటిలో ఆరు ఎయిర్‌బ్యాగ్స్, అడాస్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ వంటి భద్రతాపరమైన ఫీచర్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, పానరోమిక్ సన్‌రూఫ్, ఎయిర్‌ప్యూరిఫయర్ వంటి టెక్ ఫీచర్లు కూడా ఉన్నాయని కంపెనీ పేర్కొంది. 

Tags:    

Similar News