స్విగ్గీలో కీలక బాధ్యతల నుంచి తప్పుకున్న మరో సీనియర్ ఉద్యోగి!
ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీలో ఉన్నత స్థాయి అధికారుల రాజీనామాలు కొనసాగుతున్నాయి.
బెంగళూరు: ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీలో ఉన్నత స్థాయి అధికారుల రాజీనామాలు కొనసాగుతున్నాయి. ఇటీవల కంపెనీలోని కీలక విభాగాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులు సంస్థను వీడుతున్నారు. తాజాగా స్విగ్గీ రెవెన్యూ, సీనియర్ వైస్-ప్రెసిడెంట్‌గా ఉన్న అనూజ్ రాఠీ తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.
కంపెనీలో ఏడేళ్లకు పైగా పనిచేసిన అనూజ్, వివిధ పదవుల్లో విధులు నిర్వహించారు. పలు కీలక పదవుల్లో బాధ్యతలు నిర్వహించిన ఆయన, దేశీయంగా వినియోగదారులకు మెరుగైన సేవలందించడంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని లింక్‌డ్ఇన్ ద్వారా తెలిపారు.
కాగా, ఐదేళ్లుగా స్విగ్గీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా చేసిన దాలే వేజ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అలాగే, స్విగ్గీ బ్రాండ్, ప్రొడక్ట్, మార్కెట్, సస్టైనబిలిటీ వైస్-ప్రెసిడెంట్‌గా చేసిన ఆశిష్ లింగమనేనీ సైతం మే నెలలో స్విగ్గీ నుంచి బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో అనూజ్ రాఠీ సైతం సంస్థను వీడటం గమనార్హం. మరోవైపు స్విగ్గీ త్వరలో ఐపీఓకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.