స్టాక్ మార్కెట్లను వదలని నష్టాలు!

దేశీయ ఈక్విటీ మార్కెట్లను నష్టాలు వదట్లేదు. గరిష్ఠాల వద్ద అమ్మకాల తోడు అన్ని రకాలుగా ఒత్తిడి కారణంగా సూచీలు వరుసగా ఎనిమిదో రోజు పతనమయ్యాయి.

Update: 2023-02-28 12:16 GMT

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లను నష్టాలు వదట్లేదు. గరిష్ఠాల వద్ద అమ్మకాల తోడు అన్ని రకాలుగా ఒత్తిడి కారణంగా సూచీలు వరుసగా ఎనిమిదో రోజు పతనమయ్యాయి. మంగళవారం ట్రేడింగ్‌లో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ మన మార్కెట్లలో నష్టాలు కొనసాగాయి. ఉదయం కాసేపు లాభాల్లో కదలాడినప్పటికీ మిడ్-సెషన్ ముందు నుంచి నష్టాలు మొదలయ్యాయి.

ముఖ్యంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి జీడీపీ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో కీలక రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. అధిక ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వడ్డీ రేట్ల కారణంగా మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వీటికి తోడు విదేశీ పెట్టుబడిదారులు నిధులను క్రమంగా తరలిస్తుండటం, కంపెనీల ఆదాయాలు బలహీనపడుతున్న నేపథ్యంలో సూచీలు నీరసిస్తున్నాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 326.23 పాయింట్లు నష్టపోయి 58,962 వద్ద, నిఫ్టీ 88.75 పాయింట్లు కోల్పోయి 17,303 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మీడియా, రియల్టీ రంగాలు రాణించినప్పటికీ, ఫార్మా, మెటల్, ఐటీ, ఫైనాన్స్ రంగాలు బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఏషియన్ పెయింట్, ఎంఅండ్ఎం, పవర్‌గ్రిడ్, అల్ట్రా సిమెంట్, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి.

టాటా స్టీల్, రిలయన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇన్ఫోసిస్, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.57 వద్ద ఉంది.

Tags:    

Similar News