Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
కీలక రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు రోజంతా తీవ్ర ఒడిడుదుకులను ఎదుర్కొన్నాయి.
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాలను ఎదుర్కొన్నాయి. దేశీయంగా రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలపై మదుపర్లు ఎక్కువ దృష్టి సారించడం, కీలక రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు రోజంతా తీవ్ర ఒడిడుదుకులను ఎదుర్కొన్నాయి. వీటికితోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మద్దతు లేకపోవడం, భారత కరెన్సీ రూపాయి బలహీనపడటం వంటి అంశాలు ర్యాలీని ఒత్తిడికి గురి చేశాయి. ఐటీ స్టాక్స్‌లో కొనుగోళ్లు జరిగినప్పటికీ మిగిలిన రంగాల్లో అమ్మకాలు ప్రభావితం చేశాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 236.18 పాయింట్లు నష్టపోయి 81,289 వద్ద, నిఫ్టీ 93.10 పాయింట్ల నష్టంతో 24,548 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, మెటల్ మినహా మిగిలిన రంగాలు బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టీసీఎస్ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. ఎన్‌టీపీసీ, హిందూస్తాన్ యూనిలీవర్, టాటా మోటార్స్, కోటక్ బ్యాంక్, ఎల్అండ్‌టీ, ఏషియన్ పెయింట్, రిలయన్స్, మారుతీ సుజుకి స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి.
భారత కరెన్సీ మరోసారి ఆల్‌టైమ్ కనిష్ఠానికి పడిపోయింది. గురువారం అమెరికా డాలర్ ప్రభావంతో పాటు అంతర్జాతీయ ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా గురువారం రూ. 84.88 స్థాయిని తాకింది. అనంతరం మార్కెట్లు ముగిసే సమయంలో అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 84.87 వద్ద ఉంది.