GST: గరిష్ఠ 35 శాతం జీఎస్టీ పన్నుపై రిటైలర్ల ఆందోళన

కొన్ని ఉత్పత్తులపై 35 శాతం ప్రత్యేక రేటును ఆమోదించవద్దని ఆర్థిక మంత్రితో పాటు జీఎస్టీ కౌన్సిల్‌ను కోరింది.

Update: 2024-12-12 14:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల జీఎస్టీ రేటు హేతుబద్ధీకరణ సందర్భంగా మంత్రుల బృందం కొత్తగా 35 శాతం జీఎస్టీ శ్లాబును ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. కూల్‌డ్రింక్స్, సిగరెట్లు, పొగాకు, ఇతర అనుబంధ ఉత్పత్తులపై 35 శాతం పన్ను విధించాలని మంత్రుల బృందం సిఫార్సు చేసింది. అయితే, దీనిపై దేశవ్యాప్తంగా వర్తక సంఘాలు, విక్రయదారుల సంఘం ఇండియన్ సెల్లర్స్ కలెక్టివ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కొన్ని ఉత్పత్తులపై 35 శాతం ప్రత్యేక రేటును ఆమోదించవద్దని ఆర్థిక మంత్రితో పాటు జీఎస్టీ కౌన్సిల్‌ను కోరింది. ధరల ఆధారిత రేటు నిర్మాణం వల్ల జీఎస్టీ ఫ్రేమ్‌వర్క్‌పై తీవ్ర ప్రభావం ఉంటుందని విక్రేతల సంఘం అభిప్రాయపడింది. ఈ రకమైన సిఫార్సుల మూలంగా 'సరళమైన పన్ను' అనే మాటతో పాటు స్ఫూర్తి రెండింటినీ ఉల్లంఘించినట్టేనని గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఫలితంగా, ఇది చిన్న వ్యాపారుల లాభాల మార్జిన్‌లను దెబ్బతీస్తుంది. సమాంతర ఆర్థిక వ్యవస్థకు ఆజ్యం పోస్తుంది. ఈ చర్య ప్రధానంగా దేశీయ ఉత్పత్తిదారుల అధిక ఖర్చు వల్ల చౌక ఉత్పత్తుల మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయించే చైనా ఉత్పత్తిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది' అని పేర్కొంది. 35 శాతం జీఎస్టీ పన్ను శ్లాబ్‌ను ఆమోదిస్తే జీఎస్టీ ద్వారా వచ్చిన లాభాలు తుడిచిపెట్టుకుపోతాయని, దేశంలో పురాతన, అతిపెద్ద రిటైలర్ నెట్‌వర్క్‌కు శాశ్వత నష్టం తప్పదని ఇండియన్స్ సెల్లర్స్ కలెక్టివ్ నేషనల్ కోఆర్డినేటర్ అభయ్ రాజ్ మిశ్రా వెల్లడించారు. 

Tags:    

Similar News