RBI: ఈసారి కూడా వడ్డీ రేట్లలో మార్పు ఉండకపోవచ్చు: నిపుణుల అంచనా

సోమవారం నుంచి మొదలవనున్న ఎంపీసీలో ఆర్‌బీఐ రెపో రేటును 6.5 శాతం వద్దే యథాతథంగా కొనసాగిస్తుందని నిపుణులు పేర్కొన్నారు.

Update: 2024-10-06 14:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) మరోసారి కీలక వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. సోమవారం నుంచి మొదలవనున్న ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్ష(ఎంపీసీ)లో ఆర్‌బీఐ రెపో రేటును 6.5 శాతం వద్దే యథాతథంగా కొనసాగిస్తుందని నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం రిటైల్ ద్రవ్యోల్బణం ఆందోళనకర స్థాయిలోనే ఉండటం, ముడిచమురుపై ప్రభావం చూపించే మధ్యప్రాచ్య సంక్షోభం మరింత ముదిరే అవకాశాలు ఉండటంతో ఆర్‌బీఐ పరిస్థితులను గమనిస్తోందని భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం తగ్గి, భౌగోళిక పరిస్థితులు సానుకూలంగా మారితే డిసెంబర్‌లో జరిగే ఎంపీసీ సమావేశంలో వడ్డీ రేట్ల కోత ఉండొచ్చని అంచనా. గత నెలలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ నాలుగేళ్ల తర్వాత వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దాంతో అభివృద్ధి చెందుతున్న, భారత్ లాంటి ఆర్థికవ్యవస్థల సెంట్రల్ బ్యాంకులు దాన్ని అనుసరిస్తాయనే అంచనాలు పెరిగాయి. అయితే, ఇతర దేశాల సెంట్రల్ బ్యాంకులను ఆర్‌బీఐ అనుసరించకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, గతేడాది ఫిబ్రవరిలో కీలక రేట్లను 6.5 శాతానికి మార్చిన ఆర్‌బీఐ ఇప్పటివరకు దాన్ని కొనసాగిస్తోంది. సోమవారం(నేడు) మొదలయ్యే ఎంపీసీ సమావేశంలో కోత ఉంటుందని అంచనాలు ఎక్కువగా ఉన్నప్పటికీ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇక, ఈ నెల ప్రారంభంలో ఆర్‌బీఐ రేట్‌ సెట్టింగ్‌ ప్యానల్ మానిటరీ పాలసీ కమిటీలో ముగ్గురు వ్యక్తులను కొత్తగా నియమించిన సంగతి తెలిసిందే. 

Tags:    

Similar News