RBI: స్థిరత్వం, నమ్మకం, వృద్ధిపై ప్రత్యేక దృష్టి

ఆర్‌బీఐ గవర్నర్‌గా ఎన్నికవడం గౌరవంగానూ, ముఖ్యమైన బాధ్యతగా భావిస్తున్నట్టు తెలిపారు.

Update: 2024-12-11 13:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) 26వ గవర్నర్‌గా నియమితులైన సంజయ్ మల్హోత్రా బుధవారం అధికారికంగా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆర్‌బీఐ గవర్నర్‌గా ఎన్నికవడం గౌరవంగానూ, ముఖ్యమైన బాధ్యతగా భావిస్తున్నట్టు తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ వారసత్వాన్ని నిలబెడతానని, ఆర్‌బీఐకి మూలస్తంభాలైన స్థిరత్వం, విశ్వాసం, వృద్ధిని మరింత బలోపేతం చేస్తూ, వాటి నిర్మాణాన్ని కొనసాగించనున్నట్టు చెప్పారు. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ సరైన నిర్ణయాలు తీసుకుంటానని హామీ ఇస్తున్నట్టు సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. 'ద్రవ్య విధానాన్ని స్థిరంగా కొనసాగించడం కీలకం. ఆర్‌బీఐపై ఉన్న నమ్మకాన్ని కాపాడేందుకు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోనున్నట్టు' స్పష్టం చేశారు. వేగంగా మారుతున్న ప్రపంచ ధోరణిలో ఉన్న అనుకూలతను అవకాశంగా మార్చుకుని, విధానాలను కొనసాగించడంలో చురుగ్గా పనిచేయనున్నట్టు పేర్కొన్నారు. దీనికోసం ఆర్థిక నియంత్రణ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రంతో సహా అన్ని విభాగాలతో ఆర్‌బీఐ పరస్పర సహకారాన్ని కొనసాగిస్తుందని వెల్లడించారు. ఇదే సమయంలో ప్రపంచ ఆర్థిక, రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తూ, సరైన రీతిలో వ్యవహరించడంపై దృష్టి సారిస్తామన్నారు. 

Tags:    

Similar News