Spicejet: ఉద్యోగుల పీఎఫ్ బకాయి రూ.160 కోట్లను చెల్లించిన స్పైస్‌జెట్

రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ. 160.07 కోట్ల విలువైన బకాయిలను పూర్తి చేసినట్టు కంపెనీ తెలిపింది.

Update: 2024-12-13 13:45 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ఉద్యోగులకు చెల్లించాల్సిన ప్రావిడెంట్ ఫండ్ బకాయిలన్నింటినీ క్లియర్ చేసినట్టు ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ శుక్రవారం ప్రకటనలో వెల్లడించింది. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ. 160.07 కోట్ల విలువైన బకాయిలను పూర్తి చేసినట్టు కంపెనీ తెలిపింది. అనేక సవాళ్లను ఎదుర్కొన్న తర్వాత ఇటీవల స్పైస్‌జెట్ రూ. 3,000 కోట్ల నిధులను సమీకరించింది. ఈ నిధులను ఉపయోగించి కంపెనీ చట్టబద్ధమైన టీడీఎస్, జీఎస్టీ సహా అన్ని రకాల పెండింగ్‌లోని బిల్లులను క్లియర్ చేస్తోంది. అదేవిధంగా ఉద్యోగులకు ఇవ్వాలని పీఎఫ్ బకాయిలను కూడా చెల్లించినట్టు అధికారిక ప్రకటనలో పేర్కొంది. దీనివల్ల సంస్థ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటమే కాకుండా కార్యకలాపాల నిర్వహణకు అడ్డంకులు తొలగుతాయని కంపెనీ వివరించింది. పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బకాయిలను క్లియర్ చేయడం సంతోషంగా ఉంది. ఇది స్పైస్‌జెట్ ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది. పెండింగ్‌లో ఉన్న అన్ని చట్టబద్దమైన బకాయిలను క్లియర్ చేయడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణ, కార్యకలాపాలను మెరుగుపరచడం, ఉద్యోగుల సంక్షేమం పట్ల సంస్థకున్న నిబద్ధతను ప్రతిబింబిస్తుందని స్పైస్‌జెట్ ఛైర్మన్, ఎండీ అజయ్ సింగ్ వెల్లడించారు. శుక్రవారం స్టాక్ మార్కెట్లలో స్పైస్‌జెట్ షేర్ 1.4 శాతం మేర పెరిగి రూ. 58.59 వద్ద ముగిసింది.

Tags:    

Similar News