Amazon Prime: ప్రైమ్ వీడియో డివైజ్ షేరింగ్‌పై పరిమితి విధించిన అమెజాన్
ప్రధానంగా డివైజ్‌ల వాడకంపై పరిమితిని విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో కీలక నిర్ణయం తీసుకుంది. 2025, జనవరి నుంచి దేశీయంగా ప్రైమ్ లాగ్-ఇన్ డివైజ్‌లకు సంబంధించి పరిమితులను విధించాలని కంపెనీ భావిస్తోంది. సాధారణంగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవారు స్నేహితులు, సన్నిహితులకు లాగ్-ఇన్ వివరాలను షేర్ చేసుకుంటారు. తాజాగా దీనికి సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేసింది. ప్రధానంగా డివైజ్‌ల వాడకంపై పరిమితిని విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రైమ్ సబ్‌స్క్రైబర్లు ఒకే సమయంలో ఐదు డివైజ్‌లను వాడుకునే అవకాశం ఉంటుంది. ఎలాంటి డివైజ్ అనే బేధం లేకుండా ప్రైమ్ వీడియో చూసుకోవచ్చు. కానీ, కొత్త నిబంధనల ప్రకారం.. వచ్చే ఏడాది నుంచి కేవల 2 టీవీల్లో మాత్రమే ప్రైమ్ లాగ్-ఇన్ వాడుకోవచ్చు. అంతకంటే ఎక్కువ టీవీల్లో ప్రైమ్ వీడియో కావాలనుకుంటే కొత్త సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలని అమెజాన్ వెల్లడించింది. ఈ మార్పులపై ఇప్పటికే కంపెనీ కస్టమర్లకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించింది.