ISRO: భారత జీడీపీకి రూ.5 లక్షల కోట్లను అందించిన అంతరిక్ష రంగం

ప్రస్తుతం అంతరిక్ష రంగంలో భారత్ దూసుకుపోతుంది. కొత్త ప్రయోగాలను చేపడుతూ వాటిని విజయవంతం చేస్తూ ప్రపంచ దేశాలకు గట్టి పోటీ ఇస్తోంది.

Update: 2024-08-24 13:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం అంతరిక్ష రంగంలో భారత్ దూసుకుపోతుంది. కొత్త ప్రయోగాలను చేపడుతూ వాటిని విజయవంతం చేస్తూ ప్రపంచ దేశాలకు గట్టి పోటీ ఇస్తోంది. ఈ క్రమంలో గత 10 సంవత్సరాలలో భారత అంతరిక్ష రంగం దేశ జీడీపీకి రూ.5 లక్షల కోట్ల($60 బిలియన్ల) ఆర్థిక సహకారాన్ని అందించడంతో పాటు 4.7 మిలియన్ ఉద్యోగాలను సృష్టించిందని ఒక నివేదిక తెలిపింది.

ఇదే సమయంలో భారత్, తన అంతరిక్ష రంగంపై రూ. 1 లక్ష కోట్ల(13 బిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టింది, ఫలితంగా ప్రత్యక్ష, పరోక్ష ప్రయోజనాల ద్వారా, ఈ రంగం జాతీయ జీడీపీకి రూ.5 లక్షల కోట్లను ఇవ్వడంతో పెట్టుబడులకు తగిన ఫలితం లభించిందని ఇస్రో చేత నియమించబడిన గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ నోవాస్పేస్ పేర్కొంది. అంతరిక్ష రంగంలో పెట్టుబడుల ద్వారా వచ్చిన ప్రతి డాలర్ దేశ ఆర్థిక వ్యవస్థకు అదనపు $2.54 పరోక్ష, ప్రేరేపిత ప్రయోజనాన్ని అందించింది. గత కొన్నేళ్లుగా ఈ రంగంలో ఉద్యోగ కల్పన కూడా భారీగా పెరిగింది. ప్రభుత్వం, ప్రైవేటు రంగం ద్వారా నేరుగా 96,000 మందికి ఉపాధి లభించింది.

నివేదిక ప్రకారం, ఈ రంగం అంచనా ఆదాయాలు 2014లో $3.8 బిలియన్ల నుండి, 2023లో $6.3 బిలియన్లకు చేరాయి. ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాల ద్వారా రోజుకు ఎనిమిది లక్షల మంది మత్స్య కారులు లబ్ధి పొందుతుండగా, దాదాపు 1.4 బిలియన్ల భారతీయులు ఉపగ్రహ ఆధారిత వాతావరణ సూచనల ప్రయోజనాన్ని పొందుతున్నారని నివేదిక హైలెట్ చేసింది. అలాగే, ఈ రంగంలో స్టార్టప్‌లు వేగవంతమైన వృద్ధిని కనబరుస్తున్నాయని పేర్కొంది.


Similar News