పెరగనున్న స్మార్ట్‌ఫోన్ ధరలు

మెమొరీ చిప్‌ల కీలక సరఫరాదారులుగా ఉన్న శాంసంగ్, మైక్రాన్ మార్చి త్రైమాసికంలో ధరలను 15-20 శాతం పెంపును అమలు చేయనున్నాయి.

Update: 2024-02-05 14:30 GMT
పెరగనున్న స్మార్ట్‌ఫోన్ ధరలు
  • whatsapp icon

దిశ, బిజినెస్ బ్యూరో: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి త్వరలో షాక్ తగలనుంది. మెమొరీ చిప్‌ల ధరలు పెరగడంతో వచ్చే జూన్ త్రైమాసికం నుంచి స్మార్ట్‌ఫోన్ ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. మార్కెట్ పరిశోధనా సంస్థ ట్రెండ్‌ఫోర్స్ ప్రకారం, మెమొరీ చిప్‌ల కీలక సరఫరాదారులుగా ఉన్న శాంసంగ్, మైక్రాన్ మార్చి త్రైమాసికంలో 15-20 శాతం ధరల పెంపును అమలు చేయనున్నాయి. స్మార్ట్‌ఫోన్, పర్సనల్ కంప్యూటర్ల వినియోగం భారీగా పెరగడంతో పాటు ఏఐ, అధిక పనితీరు కలిగిన కంప్యూటింగ్ కారణంగా మెమొరీ చిప్‌ల డిమాండ్ అత్యధికంగా ఉంది. ఈ కారణంగానే కంపెనీలు చిప్‌ల ధరలు పెంచుతున్నాయి. ఆ ప్రభావం స్మార్ట్‌ఫోన్‌లపై కూడా ఉంటుందని ట్రెండ్‌ఫోర్స్ తెలిపింది. అయితే, ఇటీవల భారత ప్రభుత్వం మొబైల్‌ఫోన్ విడిభాగాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించడంతో ధరల పెరుగుదల భారం కొంత తగ్గవచ్చని అభిప్రాయపడింది. ఇప్పటికే తయారైన సరఫరాకు సిద్ధమైన ఫోన్‌లపై ధరల పెరుగుదల 3-8 శాతం ఉంటుందని అంచనా. కొత్తగా తయారీలో ఉన్న వాటి ధరలు 5-10 శాతం మేర పెరగవచ్చని ట్రెండ్‌ఫోర్స్ పేర్కొంది. ఫిబ్రవరి మూడవ వారం నుంచి మార్చిలోపు డిమాండ్‌ను బట్టి ధరలు 10-15 శాతం పెరగవచ్చని ఓ స్మార్ట్‌ఫోన్ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు.

Tags:    

Similar News