RBI ఫిన్‌టెక్ కంపెనీలకు వ్యతిరేకం కాదు: శక్తికాంత దాస్
ఇటీవల Paytm పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్‌బీఐ నియంత్రణ చర్యల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిన్‌టెక్ కంపెనీలకు వ్యతిరకం అని వచ్చిన వార్తలపై తాజాగా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ స్పందించారు
దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల Paytm పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్‌బీఐ నియంత్రణ చర్యల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిన్‌టెక్ కంపెనీలకు వ్యతిరేకం అని వచ్చిన వార్తలపై తాజాగా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ స్పందించారు. ఏ ఫిన్‌టెక్ కంపెనీకి కూడా ఆర్‌బీఐ వ్యతిరేకం కాదని, కేవలం నిబంధనలు పాటించని వాటిపై నియంత్రణ చర్యలు తీసుకుంటుందని దాస్ అన్నారు. ఫిన్‌టెక్ పరిశ్రమను ప్రోత్సహించడానికి ఎప్పుడు మద్దతును అందిస్తాము. ఫిన్‌టెక్ పరిశ్రమ అభివృద్ధి చెందడం ఆర్‌బీఐకి ఇష్టం లేదని వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం. వాటి అభివృద్ధి కోసమే కొత్త కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు శక్తికాంత దాస్ పేర్కొన్నారు.
ఫిన్‌టెక్‌లు థర్డ్ పార్టీ సేవలను అందిస్తాయని, KYCని నిర్వహించడం, ఇతర నిబంధనలను అనుసరించాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉంటుందని, ఆర్థిక రంగంలో అన్ని సంస్థలు కూడా నియమాలను పాటించాలని, భవిష్యత్తులో ఆర్థిక రంగంలో అవంతరాలు రాకుండా ప్రజలందరికీ నిర్ణీత సేవలు అందుబాటులో ఉండేలా చూడటానికి ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా దాస్ చెప్పారు.