భారీ లాభాలు సాధించిన స్టాక్ మార్కెట్లు
ఓ దశలో సెన్సెక్స్ 1100 పాయింట్లకు పైగా పుంజుకోగా, ఆఖర్లో గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణ కారణంగా 650 పాయింట్లు పెరిగాయి.
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకెళ్లాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కీలక మద్దతు లభించడం, విదేశీ మదుపర్లు దేశీయ మార్కెట్లలో పెట్టుబడులు కొనసాగించడం, కీలక ఐటీ, బ్యాంకింగ్ రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరుతో సూచీలు సరికొత్త రికార్డు స్థాయిలకు చేరువగా ర్యాలీ చేశాయి. ఓ దశలో సెన్సెక్స్ 1100 పాయింట్లకు పైగా పుంజుకోగా, ఆఖర్లో గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణ కారణంగా లాభాలు తగ్గినప్పటికీ 650 పాయింట్లు పెరిగాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 655.04 పాయింట్లు లాభపడి 73,651 వద్ద, నిఫ్టీ 203.25 పాయింట్ల లాభంతో 22,326 వద్ద ముగిశాయి. నిఫ్టీలో బ్యాంకింగ్, ఫార్మా, మెటల్, ఆటో, ఫైనాన్స్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్‌బీఐ, ఎంఅండ్ఎం, పవర్‌గ్రిడ్, నెస్లె ఇండియా, టాటా స్టీల్ 2-4 శాతం మధ్య పెరిగాయి. యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.40 వద్ద ఉంది. శుక్రవారం(మార్చి 29) గుడ్‌ఫ్రైడే సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవు. తిరిగి కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమవుతాయి.