Stock Market: వరుస లాభాల్లో స్టాక్ మార్కెట్లు

అంతకుముందు సెషన్‌లో స్థిరమైన ర్యాలీ చూసిన సూచీలు గురువారం ట్రేడింగ్‌లోనూ అదే ధోరణిని కొనసాగించాయి.

Update: 2024-08-22 12:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో మరోసారి లాభాలు నమోదయ్యాయి. అంతకుముందు సెషన్‌లో స్థిరమైన ర్యాలీ చూసిన సూచీలు గురువారం ట్రేడింగ్‌లోనూ అదే ధోరణిని కొనసాగించాయి. ప్రధానంగా దేశీయంగా కీలక ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్ వంటి బ్లూచిప్ స్టాక్స్‌లో కొనుగోళ్ల జోరు కొనసాగడంతో పాటు గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల మద్దతు కలిసొచ్చింది. అమెరికా ఫెడ్ వచ్చే నెలలో జరగనున్న సమావేశంలో వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే సంకేతాలు అంతర్జాతీయ మార్కెట్ల ర్యాలీకి కారణమయ్యాయి. దీనివల్ల ఐటీ రంగ షేర్లలో ఉత్సాహం కనిపించింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 147.89 పాయింట్లు లాభపడి 81,053 వద్ద, నిఫ్టీ 41.30 పాయింట్లు పెరిగి 24,811 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, ఏషియన్ పెయింట్, ఆల్ట్రా సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ స్టాక్స్ లాభాలు సాధించాయి. టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, ఎన్‌టీపీసీ, టీసీఎస్, పవర్‌గ్రిడ్, సన్‌ఫార్మా స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.96 వద్ద ఉంది. 

Tags:    

Similar News