తొలిసారి 78000 మార్కు చేరిన సెన్సెక్స్

ఆసియా మార్కెట్లలో ర్యాలీ, బ్లూ-చిప్ బ్యాంక్ స్టాక్‌లలో కొనుగోళ్లు ఇందుకు దోహదపడ్డాయి.

Update: 2024-06-25 11:45 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్‌లో సరికొత్త రికార్డు లెవెల్స్‌కు చేరాయి. ప్రధానంగా ఆసియా మార్కెట్లలో ర్యాలీ, బ్లూ-చిప్ బ్యాంక్ స్టాక్‌లలో కొనుగోళ్లు ఇందుకు దోహదపడ్డాయి. ఇవి కాకుండా కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం, సంస్కరణల్లో కొనసాగింపుపై ఆశలు, 100-రోజుల ఎజెండాపై దృష్టి కేంద్రీకరించడంతో ఇన్వెస్టర్లు ఎఫ్అండ్ఓలపై బుల్లిష్‌గా మారారు. ప్రభుత్వ రంగ సంస్థల షేర్లలో ర్యాలీ నెమ్మదించడంతో ప్రైవేట్ బ్యాంకుల షేర్లు పెట్టుబడిదారులకు అవకాశంగా మారాయి. ఇక,మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగడంతో విదేశీ మదుపర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కీలక సూచీలు సెన్సెక్స్ చరిత్రలో తొలిసారిగా 78,000 మైలురాయిని, నిఫ్టీ 23,750 మార్కును దాటాయి. అంతేకాకుండా గత ఆర్థిక సంవత్సరంలో జనవరి-మార్చి త్రైమాసికంలో మనదేశ కరెంట్ ఖాతా మిగులు 5.7 మిలియన్ డాలర్లుగా ఉందని, ఇది జీడీపీలో 0.6 శాతానికి సమానమని ఆర్‌బీఐ ప్రకటించింది. ఇది సానుకూల సంకేతం కావడంతో పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు మొగ్గుచూపారు.

వీటికి తోడు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లపై స్పష్టత ఇచ్చిన తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్లలో పెట్టుబడులు పెంచవచ్చని, రూపాయి మారకంపై ఒత్తిడి తగ్గే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు సూచీలకు కలిసొచ్చాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 712.44 పాయింట్లు ఎగసి 78,053 వద్ద, నిఫ్టీ 183.45 పాయింట్లు లాభపడి 23,721 వద్ద ముగిశాయి. నిఫ్టీలో బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఎల్అండ్‌టీ, ఎస్‌బీఐ షేర్లు అధిక లాభాలను సాధించాయి. పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్, నెస్లె ఇండియా, మారుతీ సుజుకి, ఎన్‌టీపీసీ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.42 వద్ద ఉంది. 


Similar News