స్టాక్ మార్కెట్ల లాభాలకు బ్రేక్
గరిష్ఠాల వద్ద మదుపర్ల లాభాల స్వీకరణ, త్రైమాసిక ఫలితాల మద్దతుతో పుంజుకున్న ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి దెబ్బతీశాయి.
దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల రికార్డు స్థాయి ర్యాలీ చూసిన దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస ఐదు సెషన్ల లాభాలకు బ్రేక్ ఇచ్చాయి. గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం, దేశీయ కంపెనీలు డిసెంబర్ త్రైమాసిక ఫలితాల మద్దతుతో పుంజుకున్న ఐటీ షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి మార్కెట్లను దెబ్బతీశాయి. వీటికితోడు కీలక రిలయన్స్ వంటి కంపెనీ షేర్ సైతం బలహీనపడటంతో నీరసించాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య చమురు ధరలు స్థిరంగా ఉండటం, భారత మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు మిశ్రమంగా ఉన్నప్పటికీ దేశీయ పరిణామాలు మార్కెట్లను బలహీనపరిచాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 199.17 పాయింట్లు నష్టపోయి 73,128, నిఫ్టీ 65.15 పాయింట్ల నష్టంతో 22,032 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్, మీడియా రంగాలు రాణించగా, ఐటీ, ఫార్మా, రియల్టీ, హెల్త్‌కేర్ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా స్టీల్, టైటాన్, ఐటీసీ, మారుతీ సుజుకి, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎల్అండ్‌టీ, టాటా మోటార్స్ షేర్లు లాభాలను సాధించాయి. హెచ్‌సీఎల్ టెక్, విప్రో, ఎన్‌టీపీసీ, రిలయన్స్, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, సన్‌ఫార్మా, టీసీఎస్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.13 వద్ద ఉంది.