వరుసగా ఐదవ రోజు లాభాల్లో స్టాక్ మార్కెట్లు

గురువారం ట్రేడింగ్‌లో ఉదయం గ్లోబల్ మార్కెట్ల ప్రభావంతో కొంత బలహీనపడినప్పటికీ మిడ్-సెషన్ తర్వాత నుంచి రాణించాయి.

Update: 2024-04-25 11:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీల్లో లాభాల పరంపర కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయంగా కీలక రంగాల్లో కొనసాగుతున్న కొనుగోళ్లు జోరు కారణంగా సూచీలు వరుసగా ఐదవ రోజు పుంజుకున్నాయి. గురువారం ట్రేడింగ్‌లో ఉదయం గ్లోబల్ మార్కెట్ల ప్రభావంతో కొంత బలహీనపడినప్పటికీ మిడ్-సెషన్ తర్వాత నుంచి రాణించాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఫార్మా రంగాల్లో మదుపర్ల సెంటిమెంట్ సానుకూలంగా ఉండటంతో లాభాలు కొనసాగాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 486.50 పాయింట్లు లాభపడి 74,339 వద్ద, నిఫ్టీ 167.95 పాయింట్ల లాభంతో 22,570 వద్ద ముగిశాయి. నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంక్ అత్యధికంగా 3.77 శాతం పుంజుకోగా, ఫార్మా, మెటల్, ఆటో, హెల్త్‌కేర్ రంగాలు ఊపందుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, నెస్లె ఇండియా, సన్‌ఫార్మా, ఐటీసీ, ఎన్‌టీపీసీ, ఎంఅండ్ఎం కంపెనీల షేర్లు లాభాలు సాధించాయి. కోటక్ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్, టైటాన్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ సుజుకి, ఏషియన్ పెయింట్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.33 వద్ద ఉంది. తాజాగా కోటక్‌ మహీంద్రా బ్యాంకుపై ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో సంస్థ షేర్లు 10 శాతానికి పైగా పతనమయ్యాయి. దాంతో బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.37,000 కోట్లకు పైగా క్షీణించింది. 

Tags:    

Similar News