Stock Market: తిరిగి లాభాలు సాధించిన స్టాక్ మార్కెట్లు
అంతకుముందు సెషన్‌లో అంతర్జాతీయ, దేశీయ పరిణామాలతో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న సూచీలు మంగళవారం ట్రేడింగ్‌లో పుంజుకున్నాయి
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మళ్లీ లాభాలను సాధించాయి. అంతకుముందు సెషన్‌లో అంతర్జాతీయ, దేశీయ పరిణామాలతో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న సూచీలు మంగళవారం ట్రేడింగ్‌లో పుంజుకున్నాయి. ఉదయం ప్రారంభంలో నష్టాలను చూసిన తర్వాత కీలక మెటల్, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో కొనుగోళ్ల జోరు, భారీ నష్టాల తర్వాత కనిష్టాల వద్ద మదుపర్లు షేర్లు కొనేందుకు ఆసక్తి చూపించడం, దేశీయ తయారీ కార్యకలాపాలు గాడిన పడటం వంటి అంశాలు లాభాలకు కారణమయ్యాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 694.39 పాయింట్లు లాభపడి 79,476 వద్ద, నిఫ్టీ 217.95 పాయింట్ల లాభంతో 24,213 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ, మీడియా మినహా అన్ని రంగాలు 1 శాతానికి పైగా రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ షేర్లు 2 శాతానికి పైగా లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్, ఐటీసీ, ఏషియన్ పెయింట్, భారతీ ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, ఎల్అండ్‌టీ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 84.12 వద్ద ఉంది.