అధిక లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ప్రధానంగా ఐటీ, మెటల్, ఫైనాన్స్ రంగాల షేర్లలో పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరిగాయి.

Update: 2024-07-01 11:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు జూలై నెలను మెరుగైన లాభాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు ఆసియా మార్కెట్ల నుంచి మద్దతు లభించడం, బ్లూచిప్ స్టాక్స్‌లో ర్యాలీ కారణంగా సూచీలు రాణించాయి. ప్రధానంగా ఐటీ, మెటల్, ఫైనాన్స్ రంగాల షేర్లలో పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరిగాయి. దీంతో బెంచ్‌మార్క్ సూచీలు సరికొత్త గరిష్ఠాలకు చేరాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 443.46 పాయింట్లు ఎగసి 79,476 వద్ద, నిఫ్టీ 131.35 పాయింట్లు లాభపడి 24,141 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మీడియా, ఐటీ, ఫైనాన్స్, మెటల్ రంగాలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఆల్ట్రా సిమెంట్, టీసీఎస్, ఇన్ఫోసిస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు అధిక లాభాలను సాధించాయి. ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, ఎల్అండ్‌టీ, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, పవర్‌గ్రిడ్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.45 వద్ద ఉంది. 

Similar News