చరిత్రలో తొలిసారి 80000 చేరిన సెన్సెక్స్
నిఫ్టీ సైతం 24,309 వద్ద ఆల్‌టైమ్ హై స్థాయిని తాకింది.
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను సృష్టించాయి. కీలక బెంచ్‌మార్క్ సెన్సెక్స్ చరిత్రలో తొలిసారిగా 80,000 మైలురాయిని చేరుకుంది. నిఫ్టీ సైతం 24,309 వద్ద ఆల్‌టైమ్ హై స్థాయిని తాకింది. బుధవారం ట్రేడింగ్‌లో కీలక బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి లభించిన మద్దతుతో సూచీలు రికార్డు గరిష్ఠాలను సాధించాయి. అయితే, చివరి అరగంటలో మదుపర్లు లాభాల స్వీకరణకు ఆసక్తి చూపడంతో సెన్సెక్స్ కీలక 80 మార్క్ నుంచి వెనక్కి తగ్గాయి. ప్రధానంగా భారతీయ బ్యాంకుల ఎన్‌పీఏలు 12 ఏళ్ల కనిష్ఠానికి తగ్గడం, సమీప కాలంలో బ్యాంకింగ్ రంగం పనితీరుపై సానుకూల అంచనాలు, అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం వంటి అంశాలు ర్యాలీకి కారణమయ్యాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 545.35 పాయింట్లు ఎగసి 79,986 వద్ద, నిఫ్టీ 162.65 పాయింట్లు లాభపడి 24,286 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మీడియా మినహా అన్ని రంగాలు ఊపందుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో అదానీ పోర్ట్స్, కోటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీల షేర్లు అధిక లాభాలను సాధించాయి. టీసీఎస్, టైటాన్, రిలయన్స్, టాటా మోటార్స్, ఎల్అండ్‌టీ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.51 వద్ద ఉంది.
సెన్సెక్స్ మైలురాళ్లు..
మైలురాయి తేదీ
1,000 జూలై 25, 1990
10,000 ఫిబ్రవరి 7, 2006
20,000 డిసెంబరు 11, 2007
30,000 ఏప్రిల్ 26, 2017
40,000 జూన్ 3, 2019
50,000 ఫిబ్రవరి 3, 2021
60,000 సెప్టెంబరు 24, 2021
70,000 డిసెంబరు 11, 2023
75,000 ఏప్రిల్ 09, 2024
80,000 జూలై 03, 2024