Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
అమెరికా గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు సోమవారం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. గత వారాంతం భారీ లాభాలతో ముగిసిన సూచీలు సోమవారం ట్రేడింగ్‌లో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మద్దతు లేకపోవడం, అమెరికా గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీనికితోడు కీలక ఆటో, ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి మార్కెట్లపై ఒత్తిడిని పెంచాయి. కొన్ని రంగాల్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు సిద్ధపడటం కూడా ఊగిసలాటకు కారణమయ్యాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 12.16 పాయింట్ల నష్టంతో 80,424 వద్ద, నిఫ్టీ 31.50 పాయింట్లు లాభపడి 24,572 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఆటో, ప్రైవేట్ బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలు నీరసించాయి. మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, మీడియా రంగాలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా స్టీల్, టీసీఎస్, ఎన్‌టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఏషియన్ పెయింట్, రిలయన్స్ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. ఎంఅండ్ఎం, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.90 వద్ద ఉంది.