ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో మంగళవారం ట్రేడింగ్‌లో సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి.

Update: 2024-05-21 11:45 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీనివల్లే మంగళవారం ట్రేడింగ్‌లో సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు నిధులను ఉపసంహరించుకోవడం, ఆసియా మార్కెట్లు బలహీనంగా ర్యాలీ చేయడం వంటి పరిణామాలు మన మార్కెట్లపై ప్రభావం చూపాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 52.63 పాయింట్లు నష్టపోయి 73,953 వద్ద, నిఫ్టీ 27.05 పాయింట్లు లాభపడి 22,529 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్ రంగం దాదాపు 4 శాతం పుంజుకోగా, పీఎస్‌యూ బ్యాంక్, మీడియా రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్, ఎస్‌బీఐ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. నెస్లె ఇండియా, మారుతీ సుజుకి, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్, టీసీఎస్ కంపెనీల స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.32 వద్ద ఉంది. ఇదే సమయంలో కీలక బెంచ్‌మార్క్ బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ తొలిసారిగా 5 ట్రిలియన్ డాలర్ల(రూ. 416 లక్షల కోట్ల)కు చేరుకుంది. 2023, నవంబర్‌లో 4 ట్రిలియన్ డాలర్కు చేరిన తర్వాత ఏడు నెలల వ్యవధిలోనే మరో మైలురాయికి చేరడం విశేషం.

Tags:    

Similar News