తక్కువ లాభాలతో సరిపెట్టిన స్టాక్ మార్కెట్లు
కీలక ఐటీ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడితో సూచీలు నీరసించాయి.
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి వారాన్ని ఫ్లాట్‌గా ముగించింది. ఊహించినట్టుగానే భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించడంతో మార్కెట్లలో ఈ అంశం పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ, భవిష్యత్తులో రేట్ల తగ్గింపు గురించి స్పష్టత ఇవ్వకపోవడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మద్దతు లేకపోవడం, ముడిచమురు ధరలు పెరిగిన నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడింది. వీటికితోడు కీలక ఐటీ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడితో సూచీలు నీరసించాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 20.59 పాయింట్లు పెరిగి 74,248 వద్ద, నిఫ్టీ అత్యల్పంగా 0.95 పాయింట్ల లాభంతో 22,513 వద్ద ముగిశాయి. నిఫ్టీలో బ్యాంకింగ్, ఫైనాన్స్, రియల్టీ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో కోటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐటీసీ, ఎస్‌బీఐ, ఎంఅండ్ఎం కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. ఆల్ట్రా సిమెంట్, ఎల్అండ్‌టీ, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్, మారుతీ సుజుకి, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.32 వద్ద ఉంది.