Stock Market: అధిక లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఉదయం ప్రారంభం నుంచే స్థిరమైన లాభాలను సాధించిన స్టాక్ మార్కెట్లు కీలక బ్లూచిప్ షేర్లలో కొనుగోళ్ల జోరుతో గరిష్ఠాలకు చేరాయి
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస బలహీన ర్యాలీ తర్వాత పుంజుకున్నాయి. అంతకుముందు రెండు సెషన్‌లలో గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల మద్దతు లేకపోవడం, గరిష్టాల వద్ద లాభాల స్వీకరణ కారణంగా ఒత్తిడికి లోనైన సూచీలు బుధవారం ట్రేడింగ్‌లో రాణించాయి. ఉదయం ప్రారంభం నుంచే స్థిరమైన లాభాలను సాధించిన స్టాక్ మార్కెట్లు కీలక బ్లూచిప్ షేర్లలో కొనుగోళ్ల జోరుతో గరిష్ఠాలకు చేరాయి. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, జపాన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచడం, అమెరికా ఫెడ్ తన నిర్ణయాలను వెలువరించనుండటం వంటి పరిణామాల మధ్య లాభాలు కొనసాగాయి. బ్యాంకింగ్ రంగంలో కొంత ఒత్తిడి కనిపించినప్పటికీ ఐటీ రంగం, ఫార్మా, దిగ్గజ కంపెనీల షేర్లు కాపాడాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 285.94 పాయింట్లు ఎగసి 81,741 వద్ద, నిఫ్టీ 93.85 పాయింట్లు లాభపడి 24,951 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్, ఫార్మా, మీడియా, ఫైనాన్స్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఏషియన్ పెయింట్, మారుతీ సుజుకి, ఎన్‌టీపీసీ, అదానీ పోర్ట్స్, భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ షేర్లు లాభాలను సాధించాయి. రిలయన్స్, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.71 వద్ద ఉంది.