రికార్డు గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణ
మిడ్-సెషన్ వరకు మెరుగైన ర్యాలీ జరిగిన తర్వాత కీలక బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలతో నష్టాలు ఎదురయ్యాయి.
దిశ, బిజినెస్ బ్యూరో: వరుస రికార్డు గరిష్ఠాలను అధిగమిస్తున్న దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఈ వారాంతం నష్టాలను ఎదుర్కొన్నాయి. నాలుగు రోజుల పాటు కొత్త గరిష్ఠాలకు చేరిన సూచీలు శుక్రవారం ట్రేడింగ్‌ను కూడా అధిక లాభాలతోనే ప్రారంభించాయి. మిడ్-సెషన్ వరకు మెరుగైన ర్యాలీ జరిగిన తర్వాత కీలక బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు, గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో నష్టాలు ఎదురయ్యాయి. ప్రధానంగా ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ స్టాక్స్‌లో పెద్ద ఎత్తున అమ్మకాలు పోటెత్తడంతో నష్టాలు తప్పలేదు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 210.45 పాయింట్లు నష్టపోయి 79,032 వద్ద, నిఫ్టీ 33.90 పాయింట్ల నష్టంతో 24,010 వద్ద ముగిశాయి. నిఫ్టీలో బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలు క్షీణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో రిలయన్స్, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్, నెస్లె ఇండియా, టైటాన్, ఎస్‌బీఐ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మారుతీ సుజుకి స్టాక్స్ అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.38 వద్ద ఉంది.