semiconductor industry: 2026 నాటికి సెమీకండక్టర్ రంగంలో 10 లక్షల ఉద్యోగాలు
ఇంజనీర్లు, ఆపరేటర్లు, టెక్ నిపుణులు, క్వాలిటీ కంట్రోల్ సహా స్కిల్స్ ఉన్న వారికి డిమాండ్ అత్యధికంగా ఉండనుంది.
దిశ, బిజినెస్ బ్యూరో: భారత్ సెమీకండక్టర్ల తయారీ కేంద్రంగా మారుతున్న నేపథ్యంలో 2026 నాటికి పరిశ్రమ వివిధ రంగాల్లో 10 లక్షల ఉద్యోగాలను సృష్టించగలదని ఓ నివేదిక అంచనా వేసింది. చిప్ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్‌లో అంచనా వేసిన 3 లక్షల ఉద్యోగాలు, అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్(ఏటీఎంపీ)లో దాదాపు 2 లక్షలు, చిప్ డిజైన్,సిస్టమ్ సర్క్యూట్, తయారీ, సరఫరా, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లోని పలు విభాగాల్లో మరిన్ని ఉద్యోగాలకు అవకాశాలు ఉంటాయని ప్రముఖ టాలెంట్ సొల్యూషన్స్ కంపెనీ ఎన్ఎల్‌బీ సర్వీసెస్ తన నివేదికలో వెల్లడించింది. ఇవి కాకుండా ఇంజనీర్లు, ఆపరేటర్లు, టెక్ నిపుణులు, క్వాలిటీ కంట్రోల్, మెటీరియల్ ఇంజనీరింగ్ సహా స్కిల్స్ ఉన్న వారికి డిమాండ్ అత్యధికంగా ఉండనుంది. సెమీకండక్టర్ పరిశ్రమకు ప్రభుత్వం నుంచి గట్టి మద్దతు ఉంది. దీనికి తోడు ప్రైవేట్ కంపెనీలు కొత్త సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్టింగ్ సౌకర్యాల కోసం పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాయి. ఇది పరిశ్రమకు సానుకూలంగా మారుతుందని నివేదిక అభిప్రాయపడింది.