అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంలో కోటక్ బ్యాంక్ పేరు
భారత మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి తమకు షోకాజ్ నోటీసులు అందాయని తెలిపింది.
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ దిగ్గజ సంస్థ, గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్‌పై స్టాక్ మానిప్యూలేషన్, అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపించిన అమెరికా షార్ట్‌సెల్లర్ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ వ్యవహారంలో భారత మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి తమకు షోకాజ్ నోటీసులు అందాయని తెలిపింది. అయితే, సెబీ షోకాజ్ నోటీసులను హిండెన్‌బర్గ్ సంస్థ 'నాన్సెన్స్'గా పేర్కొనడం గమనార్హం. ఉద్దేశపూర్వకంగా నోటీసులిచ్చినట్టుగా ఉందని అభిప్రాయపడింది. భారత్‌లో బడా వ్యాపారవేత్తల అవినీతి, మోసాన్ని బహిర్గతం చేసే వారిని భయపెట్టేదిగా ఉందని పేర్కొంది. అదానీ గ్రూప్‌లో జరుగుతున్న అవకతవకలపై నివేదిక విడుదల చేసిన సమయంలోనే ఆ కంపెనీల స్టాక్స్‌ను షార్టింగ్ చేశామని, అదానీ షేర్ల పతనాన్ని అంచనా వేసి వాటిలో ట్రేడింగ్ చేసినట్టు బయటపెట్టామని వెల్లడించింది. ఇదే సందర్భంలో హిండెన్‌బర్గ్ కంపెనీ దేశీయ ప్రైవేట్ రంగ కోటక్ బ్యాంకు ప్రస్తావనను తీసుకొచ్చింది. కోటక్ బ్యాంక్ విదేశాల్లో ఓ ఫండ్‌ను ఏర్పాటు చేసిందని, దాన్నుంచి ఓ ఇన్వెస్టర్ పార్ట్‌నర్ ద్వారా అదానీ స్టాక్స్‌ను షార్టింగ్ చేసినట్టు హిండెన్‌బర్గ్ ఆరోపణలు చేసింది. ఆ షార్టింగ్ వల్ల కోటక్ బ్యాంక్ లాభాలను ఆర్జించలేకపోయిందని, ఇన్వెస్టర్ పార్ట్‌నర్ ఎవరనేది కూడా పేర్కొనలేదని స్పష్టం చేసింది. సెబీ తన షోకాజ్ నోటీసుల్లో కోటక్ బ్యాంకు పేరు లేదని, బ్యాంకు బోర్డు సభ్యుల ప్రస్తావన కుఊడా లేదని తెలిపింది. అంటే సెబీ మరో శక్తివంతమైన భారత వ్యాపారవేత్తను రక్షించాలని భావిస్తోందని హిండెన్‌బర్గ్ ఆరోపణలు చేసింది. కాగా, హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలను కోటక్ మహీంద్రా బ్యాంక్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కోటక్ మహీంద్రా ఇంటర్నేషనల్, తమ ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ కింగ్డన్ కేపిటల్‌కు హిండన్‌బర్గ్‌కు క్లయింట్ కాదని పేర్కొంది.