Rupee: అత్యంత బలహీన కరెన్సీగా రూపాయి
ఆగష్టులో బంగ్లాదేశ్ టాకా తర్వాత రూపాయి ఆసియాలోనే అధ్వాన్న కరెన్సీగా నిలిచింది.
దిశ, బిజినెస్ బ్యూరో: భారత కరెన్సీ రూపాయి క్షీణించింది. అమెరికా డాలర్ డిమాండ్ బలంగా ఉండటం, భారత ఈక్విటీల నుంచి నిధులు వెనక్కి వెళ్లిపోవడం వల్ల రూపాయి విలువ బలహీనపడింది. దీంతో ఆగష్టులో బంగ్లాదేశ్ టాకా తర్వాత రూపాయి ఆసియాలోనే అధ్వాన్న కరెన్సీగా నిలిచింది. గత నెల భారత రూపాయి 0.2 శాతం క్షీణించింది. నెలవారీగా అమెరికా డాలర్‌తో పోలిస్తే క్షీణించిన ఆసియా కరెన్సీలు ఇవి రెండే కావడం గమనార్హం. ప్రస్తుతం డాలర్‌కు రూపాయి రూ. 83.87 వద్ద ట్రేడవుతోంది. ఇప్పటివరకు రూపాయి జీవితకాల కనిష్టం రూ. 83.97 కాగా, దీనికి దగ్గరగా ప్రస్తుత మారకం ఉంది. అయితే, గత కొద్దిరోజుల వ్యవధిలో అమెరికా డాలర్ బలహీనంగా ఉన్నప్పటికీ రూపాయి నెమ్మదిస్తోంది. దీనికి ప్రధానంగా విదేశీ నిధులు మన మార్కెట్ల నుంచి వెళ్లిపోవడం, దిగుమతిదారుల నుంచి డాలర్ డిమాండ్ పెరగడం ప్రభావితం చేశాయి. డాలర్‌తో పోలిస్తే చాలా గ్లోబల్ కరెన్సీలు బలపడినప్పటికీ, రూపాయి క్షీణించిందని బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్థికవేత్త సోనాల్ బధన్ చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్‌బీఐ రూపాయి విలువను రూ. 84 కంటే క్షీణించేందుకు అవకాశం ఇవ్వకపోవచ్చు. అందుకు తగిన చర్యలు తీసుకుంటుంది. దానికోసం వడ్డీ రేట్లపై ఫెడ్ తీసుకునే నిర్ణయాల కోసం చూస్తోందని ఫిన్రెక్స్ ట్రెజరీ అడ్వైజర్స్ హెడ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ కుమార్ భన్సాలీ పేర్కొన్నారు.