Rupee: ఆల్‌టైమ్ కనిష్టానికి రూపాయి మారకం విలువ

అమెరికా ఫెడ్ రిజర్వ్ ఇటీవల వడ్డీ రేట్లను తగ్గించాలని నిర్ణయం తీసుకోవడంతో ప్రపంచ ఆర్థిక రంగం మార్పులను సూచిస్తోంది.

Update: 2024-11-08 12:45 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ కరెన్సీ రూపాయి విలువ మరోసారి జీవితకాల కనిష్ఠానికి చేరింది. డాలరుతో రూపాయి మారకం విలువ శుక్రవారం 5 పైసలు క్షీణించి రూ. 84.37 వద్ద ఆల్‌టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్లు నిధులను వెనక్కి తీసుకోవడం, మార్కెట్లు సైతం నెమ్మదించడం వంటి పరిణామాలతో రూపాయిపై ఒత్తిడి పెరిగింది. అమెరికా ఫెడ్ రిజర్వ్ ఇటీవల వడ్డీ రేట్లను తగ్గించాలని నిర్ణయం తీసుకోవడంతో ప్రపంచ ఆర్థిక రంగం మార్పులను సూచిస్తోంది. దీనికి తోడు అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఖరారైన డొనాల్డ్ ట్రంప్ పన్నులు, వాణిజ్య విధానాలు ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేయడంతో రూపాయి మరికొన్నాళ్లు అస్థిరంగా ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ సమయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) రూపాయిపై ఉన్న ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ఎలాంటి సమర్థవంతమైన చర్యలు తీసుకుంటుందనే దానిపై అందరి దృష్టి ఉంది. ఆర్‌బీఐ తీసుకునే నిర్ణయం రానున్న రోజుల్లో మార్కెట్ వృద్ధిని నిర్దేశిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఫెడ్ రేట్ల తగ్గింపు, డాలర్ బలహీనపడితే రూపాయి క్రమంగా బలపడుతుందని విశ్లేషకులు పేర్కొన్నారు. 

Tags:    

Similar News