రూ.2 వేల నోట్ల రద్దు సంపన్నులకే షాక్!

రెండు వేల రూపాయల నోట్ల చెలామణిపై రిజర్వు బ్యాంకు ఆంక్షలు విధిచడంతో సామాన్యులపై ఎఫెక్టు ఏ మేరకు ఉంటుందన్న చర్చలు మొదలయ్యాయి.

Update: 2023-05-19 17:27 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రెండు వేల రూపాయల నోట్ల చెలామణిపై రిజర్వు బ్యాంకు ఆంక్షలు విధిచడంతో సామాన్యులపై ఎఫెక్టు ఏ మేరకు ఉంటుందన్న చర్చలు మొదలయ్యాయి. ప్రధాని మోడీ 2016లో నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన తర్వాత చాలా మంది మిడిల్ క్లాస్ ప్రజల చేతుల్లోనూ రెండు వేల రూపాయల నోట్లే కనిపించేవి. వాటికి చిల్లర దొరకడం కష్టంగా మారింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం రెండు వేల నోట్ల ముద్రణ ఆపివేసి రూ. 500 నోట్ల సంఖ్యను పెంచింది. దీంతో 2018 తర్వాత ఎక్కువగా రెండు వేల నోట్లు వ్యాపారులు, సంపన్నుల దగ్గర మాత్రమే పోగుపడ్డాయి. సామాన్య జనం దగ్గర రూ. 500 నోట్లే ఎక్కువగా తిరుగుతున్నాయి. తాజాగా ఆర్బీఐ నిర్ణయం తీసుకోవడంతో ఆ ఎపెక్టు కామన్ పబ్లిక్‌పై పెద్దగా పడేలా లేదు. గతంలో నోట్ల రద్దు సమయంలో బ్యాంకులు, ఏటీఎంల దగ్గర భారీ స్థాయి క్యూలో నిల్చునే పరిస్థితులు ఉండవని బ్యాంకు అధికారులే అభిప్రాయపడుతున్నారు.

దీనికి తోడు మొత్తం ప్రింట్ అయిన రెండు వేల రూపాయల నోట్లలో దాదాపు 73% మేర ఇప్పటికే రిజర్వు బ్యాంకు దగ్గర ఉన్నట్లు తాజా ప్రకటన ద్వారా స్పష్టమవుతున్నది. ఇక మిగిలిన 27% మాత్రమే చెలామణిలో ఉన్నాయి. లెక్కలు ఇలా ఉన్నప్పటికీ రోజువారీ వ్యాపార లావాదేవీల్లో రెండు వేల నోట్లు కనిపించడం లేదు. ఇదే విషయాన్ని పార్లమెంటు వేదికగా కూడా కేంద్ర ఆర్థిక మంత్రి పలుమార్లు వివరించారు. లెక్కల ప్రకారం చెలామణిలో పాతిక శాతానికి పైగా రెండు వేల రూపాయల నోట్లు ఉన్నప్పటికీ ఆచరణలో మాత్రం అవి వ్యాపార లావాదేవీల్లో కనిపించడంలేదనే బహిరంగంగానే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీంతో ఇవన్నీ నల్లధనం పోగేసుకుంటున్న వ్యాపారులు, రాజకీయ నాయకులు, హవాలా మార్గంలో ట్రాన్సాక్షన్లు చేసేవారిదగ్గరే పోగుపడ్డాయనే అభిప్రాయం నెలకొన్నది.

ఇప్పుడు ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో లోయర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్, పేదలకు పెద్దగా వచ్చే ఇబ్బందేమీ లేదని, అప్పర్ మిడిల్ క్లాస్, సంపన్న వర్గాలు, లెక్కల్లోకి రాకుండా దాచుకున్నవారికి మాత్రమే సమస్యలు అనేది ఓపెన్‌గా వినిపిస్తున్న మాటలు. ఒకవేళ పేదలు, లోయర్ మిడిల్ క్లాస్ ప్రజల దగ్గర రెండు వేల నోట్లు ఉన్నా బ్యాంకుల ద్వారా మార్చుకోడానికి ఇబ్బందులు లేవని, వైట్ మనీగానే వారివారి బ్యాంకు ఖాతాల్లోకి జమ అవుతాయని ఆర్థికవేత్తలు వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

రూ.2 వేల నోట్ల రద్దు.. ఇదే అసలు కారణమా?

రూ.2000 నోట్ల రద్దు చేస్తూ RBI సంచలన ప్రకటన  

Tags:    

Similar News