స్వల్పంగా తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం!
ఈ ఏడాది ఫిబ్రవరిలో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ దిగొచ్చింది.
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఫిబ్రవరిలో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ దిగొచ్చింది. గత నెలలో వినియోగదారుల ధరల సూచీ ఆధారిత(సీపీఐ) ద్రవ్యోల్బణం 6.52 శాతం నుంచి 6.44 శాతానికి తగ్గిందని గణాంక, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. అయితే, ఇప్పటికీ భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) నిర్దేశించుకున్న లక్ష్యం 6 శాతం కంటే ఎక్కువగానే ఉంది. సమీక్షించిన నెలలో ఆహార పదార్థాల ధరలు తగ్గడంతో సీపీఐ ద్రవ్యోల్బణం దిగొచ్చింది.
గత నెల ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం జనవరిలో ఉన్న 6 శాతం నుంచి స్వల్పంగా 5.95 శాతానికి తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 6.72 శాతం, పట్టణ ద్రవ్యోల్బణం 6.10 శాతంగా ఉంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఫిబ్రవరిలో ఇంధన, విద్యుత్ ద్రవ్యోల్బణం 9.90 శాతం, తృణ ధాన్యాలు 16.73 శాతం పెరిగాయి.