Jio IPO: 2025లో ఐపీఓకు రానున్న రిలయన్స్ జియో
100 బిలియన్ డాలర్ల విలువతో జియో పబ్లిక్ ఇష్యూకు సిద్ధమవుతోందని సమాచారం.
దిశ, బిజినెస్ బ్యూరో: రిలయన్స్ సంస్థకు చెందిన టెలికాం కంపెనీ జియో వచ్చే ఏడాది ఐపీఓకు రానుంది. 100 బిలియన్ డాలర్ల(రూ. లక్ష కోట్ల) విలువతో జియో పబ్లిక్ ఇష్యూకు సిద్ధమవుతోందని సమాచారం. రాయిటర్స్ ప్రకారం.. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ 2019 నాటి ప్రకటనలో సంస్థ నుంచి జియో, రిటైల్ వ్యాపార విభాగాలను ఐపీఓకు తీసుకొస్తామని చెప్పారు. కానీ ఈ ఐదేళ్లలో వాటి ప్రస్తావన ఎక్కడా రాలేదు. తాజాగా దీనిపై స్పష్టత వచ్చింది. రిటైల్ విభాగం పబ్లిక్ ఇష్యూ ఇంకొంత సమయం పట్టవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల జనరల్ అట్లాంటిక్, కేకేఆర్, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ నుంచి రిలయన్స్ రిటైల్, టెలికాం వ్యాపారాల కోసం 25 బిలియన్ డాలర్ల వరకు నిధులను సేకరించింది. కంపెనీ ఏర్పాటైన నాటి నుంచి రిలయన్స్ జియో స్థిరమైన ఆదాయంతో దేశంలోనే అతిపెద్ద టెలికాం కంపెనీగా ఉంది. జియో మొత్తం 47.9 కోట్ల సబ్‌స్క్రైబర్లను కలిగి ఉంది. ఇక, రిటైల్ విభాగంలో నిర్వహణ సమస్యలు, ఇతర సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఐపీఓను మరింత ఆలస్యం చేయవచ్చని తెలుస్తోంది.