అమెరికా కంపెనీలో మెజారిటీ వాటా కొనుగోలుకు Reliance ఒప్పందం!

ముంబై: హరిత ఇంధన రంగంలో విప్లవాత్మకమైన విస్తరణ చేపట్టనున్నట్టు ప్రకటించిన దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆ దిశగా అడుగులు వేస్తోంది...Latest Telugu News

Update: 2022-09-06 10:15 GMT

ముంబై: హరిత ఇంధన రంగంలో విప్లవాత్మకమైన విస్తరణ చేపట్టనున్నట్టు ప్రకటించిన దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ సౌర శక్తి ఉత్పత్తి కంపెనీలకు టెక్ సాయం అందించే సెన్స్‌హాక్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకున్నట్టు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.

సుమారు రూ. 255 కోట్లతో 79.4 శాతం వాటాను దక్కించుకోనున్నట్టు రిలయన్స్ సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. సెన్స్‌హాక్ కంపెనీ 2018లో ఏర్పాటు చేశారు. ఇది సౌరశక్తి ఉత్పత్తి పరిశ్రమకు సాఫ్ట్‌వేర్ ఆధారిత మేనేజ్‌మెంట్ టూల్స్‌ను అందిస్తుంది. ఈ కంపెనీ సోలార్ ప్రాజెక్టుల కోసం ప్రారంభం నుంచి ఉత్పత్తి దశ వరకు ఉండే ప్రక్రియను వేగవంతం చేసేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా సోలార్ సంబంధిత నిర్వహణ సేవలను కూడా కంపెనీ అందిస్తుంది.

నియంత్రణ సంబంధిత అనుమతులు పూర్తయితే ఈ ఏడాది చివరి నాటికి కొనుగోలు ప్రక్రియ ముగుస్తుందని రిలయన్స్ తెలిపింది. ఈ సందర్భంగా మాట్లాడిన రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, సెన్స్‌హాక్ కంపెనీతో కలిసి సోలార్ ఉత్పత్తి ఖర్చును తగ్గిస్తాం. ఉత్పాదకతను పెంచుతాం. అంతర్జాతీయంగా తక్కువ వ్యయంతో సోలార్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులకు సేవలందిస్తాం. దీనివల్ల అందుబాటులోనే సోలార్ విద్యుత్ అందించేందుకు వీలవుతుందని వెల్లడించారు.

Tags:    

Similar News